
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
యశవంతపుర: బీఎంటీసీ బస్సు దూసుకెళ్లి యువతి మృతి చెందగా ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన బెంగళూరు పీణ్య సెకండ్‌స్టేజీ పరిధిలో జరిగింది. మండ్యకు చెందిన సుమ(20) సుంకదకట్టెలో నివాసం ఉంటూ గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు విధులకు బయల్దేరి బస్సు కోసం ఫుట్‌పాత్‌పై నిలిచి ఉండగా మెజిస్టిక్ నుంచి పీణ్య వెళ్తున్న బీఎంటీసీ బస్సు అదుపుతప్పి దూసుకొచ్చి చిన్నపాటి హోటల్‌ను ఢీకొంది. ఘటనలో సుమపై బస్సు చక్రాలు వెళ్లడంతో కాళ్లు విరిగాయి. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. సుమను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. కాగా బస్సు ఢీకొని గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. డ్రైవర్, కండక్టర్ గొడవ పడటం వల్ల అదుపుతప్పి ప్రమాదానికి కారణమైందని ప్రయాణికులు ఆరోపించారు. పీణ్య పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
యువతి మృతి, ముగ్గురికి గాయాలు