మైసూరు: ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో ఉన్న చాముండి కొండకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆషాఢ మాస శుక్రవారం కావడంతో చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు సింహవాహిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. తెల్లవారు జాము నుంచే చాముండి కొండకు భక్తులు భారీగా చేరుకున్నారు. చల్లటి వాన చినుకుల మధ్యలో క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి మహాన్యాసం, రుద్రాభిషేకం, పంచమృతాలతో అభిషేకం, కుంకుమార్చన, ఏకదశ పుష్పార్చన, సహస్రనామార్చనతోపాటు వివిధ రకాల పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప, బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ, భవాని రేవణ్ణ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి, కోడలు స్మితా రాకేష్‌తో పాటు అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు.
చాముండి కొండపై
4వ ఆషాఢ శుక్రవారం
దర్శనానికి భారీగా
తరలివచ్చిన భక్తజనం
సింహవాహినిగా చాముండేశ్వరి దేవి