
జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపీ
మైసూరు: క్యాన్సర్ బాధితుల కోసం రాష్ట్రంలో సుమారు 16 జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపి చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం సిద్దరామయ్య చెప్పారు. శుక్రవారం మైసూరులోని మేటెగళ్ళిలోని జిల్లా ఆస్పత్రిలో నూతన కిమోథెరపి కేంద్రాన్ని ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 70 వేలమంది ప్రజలు క్యాన్సర్ రోగానికి గురవుతున్నారు, వారంతా చికిత్స పొందడానికి బెంగళూరు కిద్వాయి ఆస్పత్రికి వస్తారు. వారి ఇబ్బందులను చూసి దగ్గరగా చికిత్స లభించేలా జిల్లాల ఆస్పత్రుల్లో కిమోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైసూరు నగరంలో 20 బెడ్లతో కూడిన కేంద్రం ఉందని, అదనంగా మరో 10 బెడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుంచి కిద్వాయికి వెళ్లే అవసరం ఉండదని అన్నారు. కిమోథెరపీ చికిత్స ద్వారా బాధితుడు మరో 15 సంవత్సరాలు జీవించవచ్చని చెప్పారు.