
లారీని ఢీకొన్న స్కూటీ.. విద్యార్థి మృతి
హుబ్లీ: బేలూరుకు వస్తున్న వేళ స్కూటీ నిలబడిన లారీని ఢీకొనడంతో నరేంద్ర బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందారు. స్కూటీపైన గొడుగు పట్టుకొని డ్రైవ్ చేస్తుండగా ఈ దురంతం చోటు చేసుకుంది. మదిహాళ పీజీలో ఉంటున్న సదరు విద్యార్థి విశ్వాస్ మృతుడు. ప్రమాదంలో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రోణ సమీపంలోని ముగలి గ్రామ పొలం వద్ద బావిలో ఓ వ్యక్తి శవం దొరికింది. ఈ ఘటనలో మహిళతో పాటు ఓ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రోణలోని అకారి వీధి ఈశ్వర గుడి నివాసి శంకరప్ప(30) మృతదేహం లభించింది. శంకరప్ప తల్లి రేణుకా కొళ్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శంకరప్ప ఈనెల 14న తెల్లవారు జామున మట్టిని నింపడానికి వెళుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అలా వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఈ నెల 19న మృతదేహం లభించింది. హత్య జరిగి ఉండవచ్చన్న అనుమానాస్పద మృతిపై కేసు దాఖలు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వర్ష బాధిత రైతులకు
పరిహారం ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వరి కోతలు కోయక ముందే పంటలు దెబ్బ తిన్న రైతులకు నష్ట పరిహారం అందించాలని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ డిమాండ్ చేశారు. గురువారం మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను ఆయన దర్శనం చేసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించడంలో విఫలమైందని ఆరోపించారు. తమ అధికారవధిలో ఆర్టీపీఎస్‌ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. బెంగళూరుకు ఎలాంటి మౌలిక సౌకర్యాలను కల్పించకుండా గ్రేటర్ బెంగళూరుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మీపతి, అదిరాజ్, హంపయ్యనాయక్, నాగరాజ్, దూళయ్య నాయక్‌లున్నారు.
పైపులు మీద పడి ముగ్గురు మృతి ●
● కొప్పళ జిల్లాలో ఘోరం
సాక్షి,బళ్లారి: లారీలో ఉన్న పైపులను దింపడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు పైపులు మీద పడటంతో మృతి చెందిన ఘటన గురువారం కొప్పళ జిల్లా కుష్టిగిలోని పారిశ్రామికవాడలో జరిగింది. లారీలో ఉన్న పైపులను దింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు కార్మికులు పైపుల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుష్టిగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు
హొసపేటె: జిల్లా వ్యాప్తంగా మే 26 నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ–2 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంక్షలు విధిస్తూ జిల్లాధికారి దివాకర్ ఆదేశించారు. పరీక్షలను సజావుగా, శాంతియుతంగా జరపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత ప్రాంత సమీపంలో జిరాక్స్, సైబర్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి బయట వ్యక్తులు, అపరిచితులు, అన్ని రకాల మీడియా ప్రతినిధుల ప్రవేశం నిషేధించారు. పరీక్ష కేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్‌కు సాధారణ మొబైల్ ఫోన్‌ను మాత్రమే వినియోగించడానికి అనుమతి ఉందని, పరీక్షలకు నియమితులైన అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా నిషేధించినట్లు ఆయన తెలిపారు.
ప్రధానిపై అవహేళనగా పోస్టు.. వ్యక్తి అరెస్ట్
సాక్షి, బళ్లారి: సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాగలకోటె తాలూకా కలాదగి పట్టణానికి చెందిన మహమ్మద్ అజీజ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎడిట్ చేసి అవహేళనకరంగా పోస్టు చేయడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓవైసీ ఫొటో కూడా ఎడిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.