
మహా సాధ్వి హేమరెడ్డి మల్లమ్మ
సాక్షి,బళ్లారి: భక్తిమార్గంలో నడుస్తూ, సమాజాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసి, తన భక్తితో శ్రీశైల మల్లికార్జున స్వామి నిజస్వరూపాన్ని దర్శించుకుని పునీతులైన మహాసాధ్వి హేమరెడ్డి మల్లమ్మ అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం హేమరెడ్డి మల్లమ్మ జయంతి జిల్లా యంత్రాంగం, మహానగర పాలికె, రెడ్డి సమాజం ఆధ్వర్యంలో నగరంలో కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం నుంచి హేమరెడ్డి మల్లమ్మ చిత్రపటాన్ని ఎస్పీ సర్కిల్ మీదుగా బసవ భవన్ వరకు ఊరేగించారు. బసవ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్,రెడ్డి, వీరశైవ రెడ్డి లింగాయత్ సమాజ అధ్యక్షుడు మహిపాల్ తదితరులు మాట్లాడుతూ హేమరెడ్డి మల్లమ్మ యావత్ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆమె అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. భక్తితో ఏదైనా సాధించవచ్చనేందుకు మల్లమ్మను ఉదాహరణగా తీసుకోవచ్చన్నారు.
రైతు కుటుంబంలో పుట్టి..
రైతు కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ముందుకు వెళ్లిందన్నారు. చివరకు భక్తి సాధన, శివుడిని ప్రసన్నం చేసుకుని, తన కులానికి చెందిన వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని ప్రార్థించడంతో పాటు సమాజ శ్రేయస్సును కూడా కాంక్షించిందన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా దైవభక్తితో సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిందన్నారు. 15వ శతాబ్ధంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి దక్షిణ దిక్కున గల రామాపురం గ్రామంలో రామిరెడ్డి, గౌరమ్మ దంపతులకు జన్మించిన ఈమె చిన్నప్పటి నుంచి శివభక్తితో నడుచుకుందన్నారు. 16వ ఏటనే భరమరెడ్డితో పెళ్లి జరిగిందన్నారు. కుటుంబ విలువలు, దైవభక్తి, సమాజంలో అందరి సంక్షేమం కోసం శివుడిని ప్రార్థించిందన్నారు. అపారమైన శివభక్తి కలిగిన మల్లమ్మకు శివుడు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చారని గుర్తు చేశారు. అలాంటి మహాసాధ్విని నిత్యం ధ్యానిస్తే ఎంతో మంచి జరుగుతుందన్నారు. మేయర్ నందీష్, కార్పొరేటర్ సురేఖ మల్లనగౌడ, రెడ్డి సమాజ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్: అలనాటి మహ మానవతా వాది బసవణ్ణ సమకాలికురాలు హేమరెడ్డి మల్లమ్మ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని హేమరెడ్డి మల్లమ్మ సమాజం అధ్యక్షుడు బసనగౌడ అన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి, సాంఘీక సంక్షేమ శాఖ, హేమరెడ్డి మల్లమ్మ సమాజం, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. సమాజంలో బడుగు వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో పాసైన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, వీరశైవ సమాజం జిల్లాధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, రామనగౌడ, రాచనగౌడ, శరణమ్మ కామరెడ్డి, విజయ్ కుమార్, చెన్నబసవ, మల్లికార్జున, తహసీల్దార్ సురేష్‌వర్మలున్నారు.
ఆమె సిద్ధాంతాలు అనుసరణీయం
జయంత్యుత్సవంలో పలువురు వక్తలు

మహా సాధ్వి హేమరెడ్డి మల్లమ్మ