
బైక్‌ను చెత్త లారీ ఢీ, బాలుడు మృతి
● లారీకి జనం నిప్పు ● బెంగళూరులో దుర్ఘటన
యశవంతపుర: బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు, బెంగళూరు థణిసంద్ర రైల్వే ట్రాక్ వద్ద ఈ విషాదం జరిగింది. వివరాలు.. కొడుకు ఐమాన్ (10)ను తీసుకుని తండ్రి బైక్‌లో స్కూల్‌కి బయల్దేరాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన చెత్త లారీ ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఐమాన్ తీవ్ర గాయాలతో అక్కడే మరణించగా, తండ్రి గాయపడి అంబేడ్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే దుర్ఘటనతో ఆక్రోశానికి గురైన స్థానికులు చెత్త లారీకి నిప్పు పెట్టడంతో కాలిపోయింది. ధణిసంద్రలో చెత్త లారీలు ఢీకొని ఇప్పటికి నలుగురు మరణించడంపై స్థానికులు మండిపడ్డారు. యలహంక పోలీసులు పరిశీలించారు. మూడు నెలల క్రితం ధణిసంద్ర మెయిన్‌రోడ్డులో బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు.
ఉడుపిలో లవ్ గొడవ
● తండ్రి వర్సెస్ కుమార్తె ఫిర్యాదులు
యశవంతపుర: తన కూతురిని అన్య మతానికి చెందిన వ్యక్తి అపహరించాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉడుపి నగరంలో జరిగింది. తమ కుమార్తె జీనా మెరీల్.. కాలేజీకి వెళ్లి వస్తుండగా మహ్మద్ అక్రం కిడ్నాప్ చేశాడని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేశాడని తండ్రి దేవదాస్ తెలిపారు. ఈ పెళ్లికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. గతంలోను నిందితుడు తన కుమార్తె వెంట పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇదిలా ఉంటే, సదరు యువతి, అక్రంలు దేవదాసుపైనే ఆరోపణలు చేయడం గమనార్హం. తమ ప్రేమ, పెళ్లికి దేవదాస్ అడ్డుపడుతున్నట్లు ఎస్పీకి, మల్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు అక్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు.