రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ 10 వరకు నీరందిస్తామని కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో జరిగిన తుంగభద్ర ఐసీసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడగారు. తాగు, సాగునీటి వినియోగంలో అదికారులు నియమాలను పాటించి రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 18 టీఎంసీల నీరు ఉండగా డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలను మినహాయించాలన్నారు. కర్ణాటక రాష్ట్ర వాటా 11 టీఎంసీలు, ఆంధ్రపదేశ్ వాటా 4 టీఎంసీలుగా నిర్ణయించారన్నారు. ఎడమ కాలువలకు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు 3000 క్యూసెక్కులు, విజయనగర కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 150 క్యూసెక్కులు, రాయ బసవణ్ణ కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తారన్నారు. చెరువులను నీటితో నింపి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రులు జమీర్ అహ్మద్, శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యులు హంపనగౌడ బాదర్లి, నాగేంద్ర, గవియప్ప, నాగరాజ్, గణేష్, బసనగౌడ బాదర్లి, బసన గౌడ తుర్విహాళ, వసంత్ కుమారలున్నారు.
రాయచూరు, కొప్పళ, బళ్లారి,
విజయనగర జిల్లాలకు అధిక ప్రాధాన్యత
కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి