
ప్రమాదానికి కారణమైన క్రూజర్, పక్కన గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
హుబ్లీ: దీపాల పండుగ దీపావళి మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. క్రూజర్ వాహనం బైక్‌ని ఢీకొనడంతో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 14 మందికి పైగా గాయపడిన ఘటన శివళ్లి మారడి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. హెబ్బాళ గ్రామ యల్లప్ప గంటి(55), బసవరాజ్ కురహట్టి(45), ధార్వాడ గొల్లర వీధి నివాసి రోహన్ అంగడి(25) మృతులు. నవలగుంద నుంచి ధార్వాడకు బాణాసంచా కొనుగోలు కోసం బయలుదేరారు.
ఈ క్రమంలో బైక్‌ను ఎదురుగా వస్తున్న క్రూజర్ వాహనం ఢీకొంది. ధార్వాడలో పని ముగించుకొని తిరిగి ఇంటి వైపు 20కి పైగా మందితో వెళుతున్న క్రూజర్ బైక్‌ను ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా, 15 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యల్లప్ప, బసవరాజ్ ఆదివారమే చనిపోగా రోహన్ అంగడి సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుల కుటుంబాలను నవలగుంద ఎమ్మెల్యే ఎంహెచ్ కోనరెడ్డి పరామర్శించారు.