శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పరోక్షంగా విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన ఆ పార్టీ సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌తో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి సంప్రదింపులు జరిపారు. గురువారం బీకేని తన ఇంటికి పిలిపించుకున్న డీకేశి... పార్టీ సంఘటితం, లోకసభ ఎన్నికలు తదితర విషయాలపై చర్చలు జరిపారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప కూడా ఆ భేటీలో ఉన్నారు.
సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆయనను శాంత పరచడానికి అధిష్టానం ఆదేశం మేరకు డీకే శివకుమార్, బీకే హరిప్రసాద్‌తో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ దృష్ట్యా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం సందేశం పంపిందని డీకే విన్నవించినట్లు సమాచారం. బీకే విమర్శల వల్ల సిద్దుకు ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఏదైనా పదవి ఇచ్చి ఆయనలోని అసంతృప్తిని చల్లార్చవచ్చనే సమాచారముంది.
ఆందోళనకు అడ్డు చెప్పం: డీకేశి
యశవంతపుర: ఆందోళన చేయడానికి ఎవరూ అడ్డు చెప్పరని, అయితే ప్రజలకు ఇబ్బందుల కలిగించడం తగదని డీకే అన్నారు. చట్టాలను గౌరవిస్తూ బంద్, ఆందోళనలను చేయాలని తెలిపారు. తమిళనాడుకు 11 వేల క్యూసెక్కుల నీరు కావాలని కోరింది. ఇందుకు మన అధికారులు కూడా సమర్థవంతంగా వాదించినట్లు వివరించారు.
అసమ్మతిని తొలగించే యత్నం