మైసూరు: ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చాముండికొండపై చాముండేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కేఆర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స, మైసూరు మేయర్ శివకుమార్, ఎంపీ ప్రతాపసింహ పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. పౌర కార్మికులకు పాదపూజ చేసి సన్మానించి కొత్త దుస్తులు పంపిణీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థిని మృతి
యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన ఘటన బళ్లారి మార్గంలోని టయోట షోరూం వద్ద శనివారం రాత్రి జరిగింది. భారతీనగరకు చెందిన తమన్నసింగ్(16) హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ట్యూషన్ ముగించుకొని రాత్రి 11:40 గంటల సమయంలో వ్యాన్ దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తమన్నసింగ్ అక్కడిక్కడే మృతి చెందింది. చిక్కజాల పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజీలను పరిశీలించి పరారైన వాహనం డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.