
అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధికారి దివాకర్
హొసపేటె: కేంద్ర కరువు అధ్యయన బృందం ఈనెల 21న జిల్లాలో పర్యటించి కరువు ప్రాంతాల రికార్డులను గణాంకాలతో పాటు క్రోఢీకరించుకోనున్నట్టు జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలియజేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయ సభామందిరంలో జనన మరణాల సివిల్ రిజిస్ట్రేషన్ విధానం, పంటకోత ప్రయోగాలు, పంట పొలాల రీ అలైన్‌మెంట్ సమస్యలపై జిల్లా జనగణన అధికారితో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023–24వ సంవత్సరానికి కర్ణాటక రైతు భద్రత ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలోని అన్ని తాలూకాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్షరెన్స్‌లో మాట్లాడి నిర్ణీత వ్యవధిలో వర్షాకాలంలో నోటిఫై చేసిన పంటల సాగు ప్రయోగాలను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఏడాది వానాకాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనందున పంటలు మొలక దశలోనే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పంట కోత పరీక్షలను నిర్వహించాలని సూచించారు. కొన్ని ఆస్పత్రుల్లో జనన మరణాల నమోదులో జాప్యం చేస్తున్నందున నిర్ణీత గడువులోగా ఈ–జన్మ సాఫ్ట్‌వేర్‌లో జనన మరణాలను నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర కరువు అధ్యయన బృందానికి చూపించే అత్యల్ప వర్షపాతం, పంట నష్టానికి సంబంధించిన అదనపు ఫోటో, వీడియో రికార్డులను సేకరించి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ అనురాధ, అధికారులు శరణప్ప ముదుగల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
కరువు ధృవీకరణ పత్రాలను సిద్ధం చేయండి
అధికారులకు జిల్లాధికారి దివాకర్ సూచన