
అభినవహాలశ్రీస్వామీజీ, చైత్రాకుందాపుర
బనశంకరి: ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని పారిశ్రామికవేత్త గోవిందబాబు పూజారిని వంచించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై పోలీస్ కస్టడీలో ఉన్న చైత్రాకుందాపుర అస్వస్థతకు గురైంది. చైత్రాకుందాపురను గురువారం రాత్రి సాంత్వన కేంద్రంలో ఉంచగా శుక్రవారం ఉదయం అక్కడ నుంచి సీసీబీ కార్యాలయానికి తీసుకువచ్చి పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ సమయంలో నోటినుంచి నురగ వచ్చి స్పృహకోల్పోయి కిందపడిపోయింది. తక్షణం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మూర్ఛరోగంతో అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం బీపీ, పల్స్‌రేట్ సాధారణంగా ఉందని డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైత్రాకుందాపుర కోలుకుందని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లవచ్చునని డాక్టర్లు తెలిపారు. కాగా 12న అరెస్ట్ అయిన అనంతరం చైత్రా సరిగా నిద్రపోలేదని తెలిసింది. తీవ్ర ఒత్తిడికి గురై భోజనం కూడా చేయలేదు. దీంతో మూర్ఛకు గురైనట్లు చెబుతున్నారు.
బెయిల్ పిటిషన్ వేసిన అభినవహాలశ్రీస్వామీజీ
పారిశ్రామికవేత్త గోవిందబాబు పూజారిని వంచించిన కేసులో మూడో ఆరోపిగా ఉన్న విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా హిరేహడగలి హాలుమత అభినవ హాలశ్రీ స్వామీజీ బెంగళూరు నగరంలోని 57వ సీసీహెచ్ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ వేశారు. అజ్ఞాతంలో ఉన్న ఈయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్‌పై శనివారం కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా అజ్ఞాతంలో ఉన్న స్వామీజీ కోసం సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గురువారం హిరేహడగలిలో ఉన్న మఠానికి వెళ్లి నోటీస్ అంటించి వచ్చారు.