
దొడ్డబళ్లాపురం: కారులో తరలిస్తున్న 18 కేజీల గంజాయిని దేవనహళ్లి పోలీసులు పట్టుకున్నారు. దేవనహళ్లి తాలూకా నల్లూరు టోల్ వద్ద గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు కారు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చి కారును ఆపారు. కారు చెక్ చేస్తుండగా డ్రైవర్ పరారయ్యాడు. కారు తనిఖీ చేయగా 9 బ్యాగ్‌లలో 18 కేజీల గంజాయి దొరికింది. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.8 లక్షలుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు.
18 నుంచి సిద్ధి వినాయక మహోత్సవం
తుమకూరు: తుమకూరు వినాయక నగర శ్రీ సిద్ది వినాయక సేవా మండలి ఆధ్వర్యంలో 47వ గణపతి ప్రతిష్టాపన మహోత్సవం ఈనెల 18 నుంచి అక్టోబర్ 18 వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తామని మండలి ఉపాధ్యక్షుడు నాగేశ్ తెలిపారు. శుక్రవారం తుమకూరు నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది భక్త మార్కెండేయ లేదా శ్రీ సిద్ధ వినాయక వైభవం రూపాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి రోజు సాయంత్రం దృశ్యం రూపకం ఉంటుందని తెలిపారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటలకు సిద్దగంగ మఠాధిపతి శ్రీ సిద్దలింగస్వామీజీ చేతుల మీదుగా ప్రారంభ పూజ జరుగుతుందన్నారు.
విశ్వేశ్వరయ్య జయంతి
మైసూరు: మైసూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం వివిధ సంఘ సంస్థలు సర్ ఎం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ఆగ్రహార సర్కిల్‌లో ఉన్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య చిత్రటానికి శాసన మండలి సభ్యుడు సీఎస్ మంజేగౌడ నివాళి అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు.

స్వాధీనం చేసుకున్న గంజాయితో పోలీసులు