
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఎలాంటి షరతులు లేవు
కర్ణాటక: కాంగ్రెస్ ఐదు గ్యారంటీలలో ఒకటైన ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఎలాంటి షరతులు లేవు, ఉచితంగా బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో 4 ఆర్టీసీ కార్పొరేషన్‌ల అధికారులతో ఆయన సమావేశం జరిపారు. తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి నియమాలు ఉండవన్నారు.
ఏపీఎల్, బీపీఎల్ ఏం వద్దు
ఏపీఎల్, బీపీఎల్ అర్హత ఉండాలని చెప్పలేదని, అందుచేత ఆర్టీసీలో వనితలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. దీనిపై బుధవారం సీఎం వివరాలను ప్రకటిస్తారన్నారు. దీనికయ్యే ఖర్చును, ఆర్టీసీపై పడే భారాన్ని సీఎంకు వివరిస్తానన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో పాటు స్త్రీలకు ప్రయాణం ఉచితమే, ఎలాంటి షరతులు ఉండవని చెప్పారు. అన్ని భరోసాలను తాము నెరవేరుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. బీజేపీ నాయకులు గ్యారంటీల గురించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆర్టీసీకి రోజుకు రూ.23 కోట్ల ఆదాయం
కాగా, రాష్ట్రమంతటా నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లలో మొత్తం 23,978 బస్సులు ఉన్నాయి. ఇందులో 1.04 లక్షల సిబ్బంది ఉన్నారు. నిత్యం 82.51 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మొత్తం 240 డిపోలు ఉండగా, ప్రతి రోజు రూ. 23 కోట్ల ఆదాయం వస్తోంది. సంవత్సరంలో రూ.8946 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి వివరించారు.
గ్యారంటీలపై నేడు మళ్లీ సీఎం భేటీ
శివాజీనగర: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాల అమలుపై సీఎం సిద్దరామయ్య వరుసగా అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. జూన్ 1 నుంచి అమలు చేయాలని సోమవారం భేటీలో నిర్ణయించారు. ఆ రోజున పథకాల రూపురేఖలు, అర్హుల ఎంపిక పై ప్రకటన చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మా మాట్లాడుతూ ఈ ఐదు గ్యారెంటీ పథకం అమలుకు సంవత్సరానికి రూ.52 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నిధుల సేకరణకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని విషయమై బుధవారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు విధానసౌధలో సమావేశం నిర్వహిస్తారు.