
సాక్షి బళ్లారి: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ పై వంతెన నుంచి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి దావణగెరి జిల్లాలో తలె హనసు సమీపంలోని పై వంతెన వద్ద చోటు చేసుకుంది. హరీష్ హళ్లి (34) అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉండటంతో సదరు వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వంతెన పై నుంచి కిందకు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతుడు బంధువులు పోలీసుల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్షం వల్లనే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతుడు సమాచార హక్కు కార్యకర్త అని తెలిసింది. ఇంటి స్థలం వివాదంలో అరెస్టు చేశారు.