మంత్రిమండలి ఫుల్‌

రాజ్‌భవన్‌లో మంత్రుల కుటుంబాలు, అనుచరుల ఆనందహేల   - Sakshi

గ్యారంటీల అమలుపై...

బనశంకరి: మంత్రి వర్గంలో 34 స్థానాలను భర్తీ చేశామని, పాలనలో నూతన మార్పులు తీసుకురావాలని తీర్మానించామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం విధానసౌదలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు చేశామని, పాత, కొత్త ముఖాలకు అవకాశం కల్పించామని, కానీ మొదటిసారి గెలిచిన వారికి పదవులు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు, ఐదు గ్యారంటీల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రవేశపెడతామని తెలిపారు. ఆ వెంటనే అమల్లోకి తీసుకువస్తామన్నారు. కొడగు, హవేరి, హాసన, చిక్కమగళూరు తదితర జిల్లాలకు కేబినెట్లో చోటు లేకపోయిందన్నారు. పుట్టరంగశెట్టి డిప్యూటీ స్పీకర్‌ పదవికి అంగీకరించలేదన్నారు. అసంతృప్తి ఎప్పుడూ ఉండేదే అన్నారు.

శివాజీనగర: సిద్దరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులుగా చేరారు. నాలుగురోజుల కసరత్తు తరువాత ఢిల్లీలో రాష్ట్ర నేతలు, హైకమాండ్‌ పెద్దలు కలిసి జాబితాను ఖరారు చేశారు. బెంగళూరు రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. 23 మంది ఎమ్మెల్యేలు, అలాగే అసెంబ్లీలో ఏ పదవీ లేని రాయచూరు జిల్లా నేత బోసురాజు చేత గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం, డీసీఎం, మరో 32 మంది మంత్రులతో కలిసి కేబినెట్‌ పరిమాణం 34కి చేరింది. ఇక పూర్తిస్థాయి మంత్రి మండలి ఏర్పాటైనట్లే. కొత్తగా ఒకటి రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా వీలు ఉండదు.

నూతన మంత్రులు ఎవరెవరంటే

నూతన మంత్రులుగా హెచ్‌.కే.పాటిల్‌, కృష్ణభైరేగౌడ, ఎన్‌.చెలువరాయస్వామి, కే.వెంకటేశ్‌, హెచ్‌.సీ.మహదేవప్ప, ఈశ్వర ఖండ్రె, కే.ఎన్‌.రాజణ్ణ, దినేశ్‌ గుండురావు, శరణ బసప్ప దర్శనాపుర, శివానంద పాటిల్‌, ఆర్‌బీ తిమ్మాపుర, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, శివరాజ తంగడగి, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌, మంకాళు వైద్య, లక్ష్మీ హెబ్బాళ్కర్‌, రహీంఖాన్‌, డీ సుధాకర్‌, సంతోష్‌ లాడ్‌, ఎన్‌.ఎస్‌.బోసురాజు, భైరతి సురేశ్‌, మధు బంగారప్ప, ఎం.సీ.సుధాకర్‌, బీ నాగేంద్ర తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మే 20న ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీగా డీకేశి, మరో 8 మంది మంత్రులు ప్రమాణం చేయడం తెలిసిందే.

రాజభవన్‌ బయట జనసందడి

రాజ్‌భవన్‌లోకి పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించగా, బయట కొత్త మంత్రుల అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. అనుకూల నినాదాలు మిన్నంటాయి. రాజ్‌భవన్‌ బయట రోడ్డులో భారీ ఎల్‌ఇడీ తెరను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో వాహన సంచారాన్ని బంద్‌ చేశారు.

అసంతృప్తి లేదే: సీఎం

మంత్రి పదవి దక్కలేదని ఒక్కరు కూడా తన వద్ద అసంతృప్తిని వ్యక్తం చేయలేదని సీఎం సిద్దు అన్నారు. బీజేపీని విడిచి కాంగ్రెస్‌ చేరిన జగదీశ్‌ శెట్టర్‌, లక్ష్మణ సవదిలను మంత్రి మండలిలోకి చేర్చుకొంటారా అని విలేకరులు ప్రశ్నించగా, చూద్దామని సమాధానం చెప్పారు.

కొత్తగా 24 మంది మంత్రుల ప్రమాణం

ఒక్క కుర్చీ ఖాళీ లేకుండా భర్తీ

రాజ్‌భవన్‌లో ఆర్భాటంగా కార్యక్రమం

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top