కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని గిద్దె పెరుమాండ్లస్వామి ఆలయం 2 డివిజన్ల పరిధిలోకి వస్తుందని నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం మధ్యేమార్గంగా సూచించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో దేవాలయ పరిధిపై 9, 10 డివిజన్ల కార్పొరేటర్ల నడుమ వివాదం మొదలవడం తెలిసిందే. దీనిపై పెరుమాండ్ల.. పంచాయతీ శీర్షికన ఈనెల 8న సాక్షిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఆలయం పరిధి 2 డివిజన్లలోకి వస్తుందని డీసీపీ బషీర్ నోటీసు ద్వారా ఇంటిమేషన్ ఇచ్చారు.
నగరంలోని ప్రముఖ దేవాలయమైన గిద్దె పెరుమాండ్లస్వామి గుడిలో ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నగరవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఉత్సవాలు, జమ్మికి ఈ గుడికే వస్తారు. ఇతర పండుగలు కూడా ఈ గుడిలో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే దేవాలయం ప్రొటోకాల్‌పై 9, 10 డివిజన్ల కార్పొరేటర్ల నడుమ వివాదం ఏర్పడింది. ఆలయం పూర్తిగా 9వ డివిజన్‌లోనే ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి, 10వ డివిజన్‌కు కూడా వస్తుందని బీజేపీ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య పట్టుబట్టారు. డివిజన్ డీలిమిటేషన్ మ్యాప్ అందివ్వాలంటూ కొమురయ్య ఇటీవల టౌన్ ప్లానింగ్‌కు దరఖాస్తు చేశారు కూడా. ఈ క్రమంలో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఆలయం ఇంటి నంబర్ 8–7–178 మొత్తంగా 9వ డివిజన్‌లోనే ఉందని, కాని భౌగోళికంగా చూస్తే ఆలయానికి మూడువైపులా ఆనుకొని ఉన్న ప్రాంగణాలు 10వ డివిజన్‌కి సంబంధించిన ఇంటి నంబర్లను కలిగి ఉన్నాయని టౌన్ ప్లానింగ్ వెల్లడించింది. ఈ కారణంగా ఆలయ ప్రాంగణం 2 డివిజన్లను పంచుకుంటోందని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్ ప్రకారం గెజిట్ ఆధారంగా హద్దులు నిర్ణయించాలి తప్ప.. ఇలా కాదని కాంగ్రెస్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.


