● కరీంనగర్‌లో ప్రాంతీయ కోచింగ్ హబ్ ఏర్పాటు
కరీంనగర్‌స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), తెలంగాణలో గ్రాస్ రూట్ స్థాయి నుంచి క్రికెట్‌ను బలోపేతం చేయడం కోసం కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్లతో కలిసి ప్రాంతీయ కోచింగ్ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో కరీంనగర్ హబ్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఆటగాళ్లకు, మహబూబ్‌నగర్ హబ్ దక్షిణ తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు శిక్షణ కేంద్రాలుగా సేవలందించనున్నాయి.జిల్లాస్థాయి ఆటగాళ్లను తీర్చిదిద్దడమే లక్ష్యమని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి తెలిపారు.
ఒక మైలురాయి
కరీంనగర్‌లో ఉత్తర తెలంగాణ క్రికెట్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక మైలురాయి అని కరీంనగర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు వి.ఆగంరావు అన్నారు. కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది అద్భుతమైన ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లున్నారు. కానీ సరైన శిక్షణ, ఆధునిక వసతులు లేక వెనకబడిపోతున్నారు. ఇప్పుడు హెచ్‌సీఏతో కలిసి మా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా సాగే ఈ ప్రొఫెషనల్ క్యాంప్స్ ద్వారా స్థానిక ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది క్రికెటర్లకు ఎంతో మేలన్నారు.


