ఆటో కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

ఆటో కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● ముందు వెళ్తున్న ఆటోను ఢీకొని మరో ఆటో బోల్తా ● డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి ● కొదురుపాక వంతెన వద్ద ఘటన

బోయినపల్లి(చొప్పదండి): ఆటో కొనేందుకు యజమానితో కలిసి వెళ్లిన వ్యక్తి తిరుగు ప్రయాణంలో అదే ఆటో ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఫోర్‌లేన్‌ వంతెన పరిసరాల్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ వివరాల ప్రకారం వేములవాడలో నివాసం ఉంటున్న నాగ శేఖర్‌(29) అదే ప్రాంతానికి చెందిన ఎండీ.సోహెల్‌ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మరో ఆటో కొనుగోలు చేసేందుకు శేఖర్‌ సోహెల్‌తో కలిసి వెంకట్రావుపల్లి గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో సోహెల్‌ ఆటో ముందుగా, నాగ శేఖర్‌ ఆటో వెనుక వెళ్తున్నాయి. కొదురుపాక రింగ్‌రోడ్డు దాటి ఫోర్‌లేన్‌ వంతెన ఎక్కే క్రమంలో సోహెల్‌ ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వెళ్తున్న నాగ శేఖర్‌ ఆటో ముందున్న ఆటోను ఢీకొని కుడివైపున బోల్తా పడింది. నాగ శేఖర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శేఖర్‌ భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ధర్మారం: మండలకేంద్రంలోని గణేశ్‌నగర్‌కు చెందిన గంగాధర నడిపి లక్ష్మి (55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో కాలనీవాసులు అనామానాలు వ్యక్తం చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు.. లక్ష్మి తన కుమారుడు వెంకటేశ్‌, కోడలు పుష్పలతతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఉపాధి పనులకు వెళ్లిన లక్ష్మి శనివారం ఉదయం మృతిచెందినట్లు ఆమె కోడలు చుట్టుపక్కల వారికి తెలిపినట్లు సమాచారం. అయితే లక్ష్మి ఇంటి సమీపంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడకు చున్నీ ఉండటాన్ని గమనించి కాలనీవాసులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవని, గతంలో ఈ వివాదాలు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీకాంత్‌ మృతురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. అంత్యక్రియలు పూర్తయినందున మృతికి గల కారణాలు నిర్ధారించేందుకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జూలపల్లిలో పాముకాటుకు మహిళ..

జూలపల్లి: మండలంలోని అబ్బాపూర్‌లో శనివారం పాముకాటుతో కొత్తపెల్లి భాగ్యలక్ష్మి(71) మృతిచెందింది. ఎస్సై మల్లేశ్‌ కథనం ప్రకారం.. భాగ్యలక్ష్మి, మల్లేశం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా బతుకుదెరువు నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్నారు. మధ్యానం భాగ్యలక్ష్మి ఇల్లు శుభ్రం చేసిన చెత్తను బయట వేసేందుకు ఇంటి వెనకాలకు వెళ్లగా నాగుపాము కాటు వేసింది. జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement