జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు
● ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణంపై పరిమితులు ● లబ్ధిదారుల్లో ఆందోళన
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కొత్త నిబంధనలు విధించింది. అనుమతించిన ప్లాన్ ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలనే షరతు పెట్టింది. నిర్దిష్టమైన స్లాబ్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన లబ్ధిదారులకు బిల్లులను మంజూరు చేసేది లేదంటూ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈనెల 1 నుంచి కచ్చితంగా కొత్త నిబంధనల ప్రకారం నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారులకు మాత్రమే బిల్లులను చెల్లిస్తామని పేర్కొంది.
స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు
కరీంనగర్ జిల్లాలో మొత్తం 11,419 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం 7,901 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొందరు లబ్ధిదారులు గోడల కంటే 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు స్లాబ్‌ను పొడిగిస్తున్నారు. స్లాబ్ విస్తీర్ణం పొడిగిస్తూ భారీ ఇంటి నిర్మాణం చేపట్టడంతో లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఆర్ధిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులను విధించింది. 2 నెలల క్రితమే స్లాబ్ పరిమితిపై ఉత్తర్వులు జారీ చేసినా.. ఈనెల 1 నుంచి కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ప్రకారం 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ విస్తీర్ణం గరిష్టంగా 500 అడుగుల్లోపుండాలని, 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఇంటికి స్లాబ్ గరిష్టంగా 750 అడుగులుండాలని నిబంధన పెట్టింది. ఇంటి ముందు స్లాబ్‌ను గరిష్టంగా 3 అడుగులకు పరిమితం చేయగా.. మిగతా మూడువైపులా ఒక అడుగు మాత్రమే నిర్మించాలని సూచించింది. నిబంధనకు మించి విస్తీర్ణంలో స్లాబ్ నిర్మిస్తే బిల్లులు నిలిచిపోతాయని గృహ నిర్మాణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకా రం ఇంటి నిర్మాణం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మంజూరైన ఇళ్లు : 11,419
ముగ్గు పోసినవి : 9,179
గ్రౌండింగ్ చేసినవి : 7,901
బేస్‌మెంట్ లెవల్ : 1,005
రూఫ్ లెవల్ : 492
స్లాబ్ లెవల్ : 3,261
పూర్తయినవి : 3,143


