కరీంనగర్ అర్బన్: కొత్తగట్టు స్టేజీ వద్ద జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. గ్రామస్తులు రహదారిని సురక్షితంగా దాటేందుకు వీలుగా క్రాసింగ్ వద్ద ర్యాంపు నిర్మాణం చేపట్టాలని సూచించారు. మంగళవారం రాత్రి తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, జాతీయ రహదారి–563 ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్ తదితర అధికారులతో కొత్తగట్టు వద్ద నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. కొత్తగట్టు వద్ద ర్యాంపు లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు చేసిన విజ్ఞప్తి, సమస్యకు పరిష్కార మార్గాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాసింగ్ వద్ద ర్యాంపు నిర్మాణానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ కమిటీ
ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్, జిల్లా టిజీఓల అధ్యక్షులు మడిపల్లి కాళిచరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నూతన మేనేజింగ్ కమిటీ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం లను మర్యాదపూర్వకంగా కలిసింది. ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ సంగెం లక్ష్మణరావు నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో, డీఆర్వోలను నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ వి.రాధాకృష్ణారెడ్డి, కోశాధికారి గోనె శ్రీనివాస్, స్టేట్ ఈసీ మెంబర్ కుందారపు మహేశ్వర్, సభ్యులు కనపర్తి మనోహర్‌రావు, కేశవరెడ్డి, శ్రీహరి రెడ్డి, రాకేశ్, అన్నారెడ్డి, విద్యాసాగర్, నరేందర్, సురేశ్, మునీందర్, రాజిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


