బీడీ టేకేదారు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బీడీ టేకేదారు ఆత్మహత్య

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బీడీ టేకేదారు అవధూత సుమన్‌ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు .. నిమ్మపల్లికి చెందిన అవధూత శంకర్‌–విజయ దంపతుల కుమారుడు సుమన్‌(39)కు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగినా సంతానం కలగలేదు. కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమన్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా తగ్గడం లేదు. దీంతో మనస్థాపానికి గరైన సుమన్‌ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య కల్పన ఉంది. మృతుని సోదరుడు అవధూత శ్రీనివాస్‌ ఫిర్యాదుతో ఎస్సై రామ్మోహన్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మందలించిందని కొడుకు..

రాయికల్‌: తల్లి మందలించిందని కొడుకు దాకురి భరత్‌( 22) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ధర్మాజీపేటలో చోటుచేసుకుంది. ధర్మాజీపేట గ్రామానికి చెందిన దాకురి భరత్‌ కొద్ది రోజులుగా ఎలాంటి పని పాటా లేకుండా తిరగడంతో తల్లి మందలించింది. భరత్‌ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అంతా తల్లి మోస్తోంది. పని చేయాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన భరత్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌ రావు తెలిపారు.

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

వెల్గటూర్‌: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెల్గటూర్‌ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన విజయ శ్రీనివాస్‌ దత్తాత్రేయ(85) దైవ దర్శనం నిమిత్తం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలకు బయలుదేరాడు. వెల్గటూర్‌ సమీపంలోని బ్రిడ్జి వద్ద బస్సు దిగిన దత్తాత్రేయ ఆదివారం సాయంత్రం తన భార్య వేధింపులు తట్టుకోలేక సమీపంలోని పెద్ద వాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు, జాలరులు అతడిని కాపాడి బయటకు తీసుకవచ్చారు. అయితే అతని మాటలను బట్టి మతిస్థిమితం సరిగా లేనట్లు స్పష్టమవుతుందని, పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి పట్టివేత

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి క్రయ, విక్రయాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించా రు. ఈక్రమంలో ఆదివారం ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన ఒకరు రూ.4 వేల విలువ చేసే గంజాయిని పెద్దపల్లి నుంచి కొనుగోలు చేసి తీసుకెళుతుండగా పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజా యి క్రయ, విక్రయాలపై, అపరిచితులు, అనుమానితుల కదలికలపై తెలిసిన వారు వెంటనే సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నరేశ్‌ సూచించారు.

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్‌

హుజూరాబాద్‌రూరల్‌: హనుమకొండ– కరీంనగర్‌ రహదారిపై ఆదివారం ఓమ్నీ వ్యాన్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ నగరం కొత్తూరుజెండా ప్రాంతానికి చెందిన 9 మంది కూలీలు పనుల నిమిత్తం ఓమ్నీ వ్యాన్‌లో కరీంనగర్‌ బయలుదేరారు. హుజూరాబాద్‌ శివారులోకి రాగానే వ్యాన్‌ టైర్‌ పేలిపోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో వెంటనే 108 అంబులెన్స్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుజూ రాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో వరంగల్‌ ఎంజీఎంకు రెఫర్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement