ఇంకా 2,522 ఫోన్లు ఎక్కడ?
సీఈఐఆర్ ‘సైరన్’
కరీంనగర్‌క్రైం: చేతిలోని సెల్‌ఫోన్ పోయిందంటే ఒకప్పుడు ఇక దొరకదనే నిరాశే. కానీ ఇప్పుడు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) వ్యవస్థతో పోయిన మొబైల్ ఫోన్ల ఆచూకీని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫోన్ చోరీలు, పోగొట్టుకున్న మొబైళ్లపై అందిన ఫిర్యాదులను సీఈఐఆర్‌లో నమోదు చేసి వాటి వినియోగాన్ని నిలిపేయడంతోపాటు కొత్త సిమ్ వినియోగం, ఐఎంఈఐ వివరాల ఆధారంగా పోలీసులు ఫోన్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2023 ఏప్రిల్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు మొత్తం 8,609 మొబైళ్లకు సంబంధించి ఫిర్యాదులందాయి. వీటిలో 5,095 మొబైళ్లను గుర్తించగా.. 2,573 మొబైళ్లను బాధితులకు అప్పగించారు. మొత్తంగా 51 శాతం మొబైళ్లను రికవరీ చేసి బాధితుల చేతికందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో 2,522 మొబైళ్లు ఇంకా రికవరీ కావాల్సి ఉంది.
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 2,576 మొబైళ్లకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 1,327 మొబైళ్లు గుర్తించగా.. 575 ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఇంకా 752 మొబైళ్లు రికవరీ కావాల్సి ఉంది. కరీంనగర్ టూ టౌన్‌లో 1,158 ఫిర్యాదులందగా.. 735 మొబైళ్లను గుర్తించి, 317 మొబైళ్లను బాధితులకు అప్పగించారు. కరీంనగర్ రూరల్ పరిధిలో 782 ఫిర్యాదులు నమోదవ్వగా.. 373 మొబైళ్లు బాధితుల చెంతకు చేరాయి.
రికవరీ శాతంలో ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ ముందంజలో ఉంది. ఇక్కడ 89 ఫిర్యాదులందగా.. 53 మొబైళ్లను బాధితులకు అప్పగించారు. పట్టిక ప్రకారం 83 శాతం రికవరీ నమోదైంది. చొప్పదండి, మానకొండూర్ పోలీస్ స్టేషన్లు కూడా 74 శాతం రికవరీతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. కరీంనగర్ రూరల్ 72, గన్నేరువరం 69, రామడుగు 67 శాతం నమోదు చేశాయి.
కరీంనగర్ నగరంలోని పోలీస్ స్టేషన్ల గణాంకాలను పరిశీలిస్తే మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీలకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పరిధుల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. కరీంనగర్ త్రీ టౌన్‌లో 575 ఫిర్యాదులందగా.. 187 మొబైళ్లు బాధితులకు తిరిగి చేరాయి. కరీంనగర్ సీసీఎస్ పరిధిలో 110 ఫిర్యాదులకు గాను 38 మొబైళ్లు అప్పగించారు.
మొత్తం గణాంకాల్లో అత్యంత కీలక అంశం ఇంకా 2,522 మొబైళ్లు రికవరీ కావాల్సి ఉండడమే. అంటే ఫిర్యాదుల ఆధారంగా గుర్తింపు, రికవరీ ప్రక్రియలో ఇంకా గణనీయమైన సంఖ్యలో మొబైళ్లు మిగిలి ఉన్నాయి. వీటి ఆచూకీ కోసం పోలీసులు సీఈఐఆర్‌తోపాటు ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించాల్సిన అవసరముంది. ఒకవైపు ఇల్లందకుంట వంటి ప్రాంతాల్లో 83 శాతం వరకు రికవరీ నమోదవుతుండగా.. మరోవైపు కొత్తపల్లి 35, హుజూరాబాద్ 36, జమ్మికుంట 39 శాతం రికవరీతో వెనకబడి ఉన్నాయి. దీంతో ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ రికవరీ ప్రక్రియలో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మిగిలిన 2,522 ఫోన్ల రికవరీపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు సీఈఐఆర్‌లో ఐఎంఈఐ నంబర్‌తో ఫోన్‌ను బ్లాక్ చేయించుకోవడం ద్వారా దాని అక్రమ వినియోగాన్ని అడ్డుకునే అవకాశముంటుంది. ఫోన్ మరో సిమ్‌తో వినియోగంలోకి వచ్చినప్పుడు దాని ఆచూకీ గుర్తించేందుకు ఈ వ్యవస్థ పోలీసులకు ఉపయోగపడుతుంది. మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.


