విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

నోటీసుల పరిష్కారానికి సహకరించాలి సోలార్‌ విద్యుత్‌ భవితకు రక్ష

కరీంనగర్‌ క్రైం: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.వెంకట సత్య రాజ్‌కిరణ్‌ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నగరంలోని ట్రినిటీ బాలుర జూనియర్‌ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రాజ్‌కిరణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి తమను తాము రక్షించుకోవచ్చన్నారు. స్మార్ట్‌ఫోన్‌ను విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ తణుకు మహేశ్‌, ఎలుగు తన్మయ్‌, వన్‌టౌన్‌ ఎస్సై రాజన్న పాల్గొన్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎస్‌ఐఆర్‌ నోటీసుల పరిష్కారానికి రాజకీయ పార్టీలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ కోరారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఎస్‌ఐఆర్‌ నోటీసులపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు జారీ అయిన ఓటర్లు సంబంధిత బీఎల్‌వోల ద్వారా హియరింగ్‌ పూర్తి చేయించుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువపత్రాలు సమర్పించకపోతే, తమ ఓట్లు కోల్పోతారని స్పష్టం చేశారు. బ్యాంక్‌ అకౌంట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, పాన్‌కార్డ్‌,పాస్‌బుక్‌ లాంటి 12 రకాల ధ్రువపత్రాలు అందచేసి బీఎల్‌వోలకు సహకరించాలన్నారు. సర్‌ డ్రాఫ్ట్‌లో ఓటు రాని వాళ్లు ఫారం 6 ద్వారా సరైన ధ్రువపత్రాలతో కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. నోటీసులు జారీ అయిన 20 వేల మంది ఓటర్లు వారం రోజుల్లో హియరింగ్‌ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు సిరాజ్‌ హుస్సేన్‌, సత్తినేని శ్రీనివాస్‌, నాంపల్లి శ్రీనివాస్‌, సిరిసిల్ల అంజయ్య, మాజిద్‌ హుస్సేన్‌, తహసీల్దార్లు నర్సింగరావు, రాజేశ్‌, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

హుజూరాబాద్‌: భవిష్యత్‌ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్‌ వినియోగం వైపు మళ్లాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి సూచించారు. హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం నిర్వహించిన సౌర విద్యుత్‌ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతి ప్రసాదించిన సూర్యరశ్మి తరగని శక్తి వనరని, దీనిని సద్వినియోగం చేసుకుంటే విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడంతోపాటు సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటుతో విద్యుత్‌ వినియోగంలో పొదుపు సాధించడంతో పాటు భవిష్యత్‌లో స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి దోహదపడుతుందని తెలిపారు.

ఏసీబీ పేరిట బల్దియా అధికారులకు బెదిరింపు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ అధికారులకు మరోసారి ఏసీబీ పేరిట బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. శనివారం మధ్యాహ్నం ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఓ ఏఈ, డీఈలకు కాల్‌ చేసిన ఓ వ్యక్తి తాను ఏసీబీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పాడు. కలవాలంటూ ఆయన మాట్లాడుతుండడంతో, మొన్న కూడా తమకు ఇలానే ఫోన్‌లు వచ్చాయని సదరు అధికారులు బదులిచ్చారు. దీంతో అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్‌ కట్‌ చేశాడు. ఇటీవల నగరపాలకసంస్థలోని టౌన్‌ప్లాన్‌ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. ఆ తరువాత ఇంజినీరింగ్‌ అధికారులకు ఏసీబీ పేరిట బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. మళ్లీ తాజాగా అదే ఇంజినీరింగ్‌ విభాగ అధికారులకు ఏసీబీ పేరిట బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement