ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● రెండున్నరేళ్లుగా ఎదురుచూపులేనా? ● కొత్త కమిటీ పేరిట కాలయాపన ● పట్టని పాలకులు.. అధికారులు ● పేరుకుపోతున్న ఎస్సీ, ఎస్టీ సమస్యలు

విద్యానగర్‌(కరీంనగర్‌): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు మంగళవారం కరీంనగర్‌ రీజినల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆర్‌ఎంకు వినతి పత్రం అందజేశారు. 2013 పీఆర్సీ ఏరియర్స్‌పై యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను పీఎఫ్‌ కమీషనర్‌ ఆఫీస్‌కు పంపించాలని, విఽశ్రాంత ఉద్యోగులకు 2017 పిఆర్సీ బకాయిలు తొమ్మిదేళ్లు అవుతున్నా ఇంత వరకు చెల్లించలేదని, 2021 పీఆర్సీనీ అమలు పర్చి రావల్సిన సీఆర్‌సీ ఏరియర్స్‌ చెల్లించాలని కోరారు. స్వచ్చంద విరమణ పొందిన ఉ ద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు దహన సంస్కారాల కోసం రూ.30వేల సహాయాన్ని వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు గంగాధర్‌, జోనల్‌ కార్యదర్శి జేజే రత్నం తదితరులు ఉన్నారు.

అట్రాసిటీ కమిటీపై నీలినీడలు

కరీంనగర్‌టౌన్‌: ‘ప్రతీ మూడు నెలలకోసారి దళిత సమస్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపుతాం. దళితవర్గాల వెన్నంటి ఉంటాం’.. అని ప్రకటించడం మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు రీవాజుగా మారుతోంది. దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏడాదిన్నరగా నిర్వహించకుండా కాలయాపన చేయడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.

రెండున్నరేళ్లుగా ఎదురుచూపులేనా

దళిత వర్గాల సమస్యల పరిష్కారానికి మూడు నెలలకోసారి జరగాల్సిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం ఏడాదిన్నరగా జరుగడం లేదు. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త కమిటీని నియమించడంలేదు. అసలు కమిటీ ఉన్నట్టా.. లేనట్టా అనే సందేహం నెలకొంది. అట్రాసిటీ కమిటీలో దళితుల్లో వివిధవర్గాలకు చెందిన 14 మంది నామినెట్‌ చేసిన సభ్యులు ఉంటారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌, సీపీ, ఏసీపీలు, డీఆర్వో, ఆర్డీవో, జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమశాఖ అధికారులతో పాటు జిల్లాస్థాయి అధికారులు ఉంటారు. వీరు జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, నిరుపేద దళితులకు ప్రభుత్వ భూముల పంపిణీ, భూమి తగాదాలు, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారయత్నాలు, నేరాలు, భౌతికదాడులు, వేధింపులు, పక్కాగృహాల మంజూరు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీకి బాధితులు అందించిన ఫిర్యాదులపై సమీక్ష జరిపి దోషులకు శిక్షలు పడేలా పనిచేయాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను సైతం విచారణ పేరిట నాన్చుతూ తీరని అన్యాయం చేస్తున్నారని జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ దళిత సంఘాల సభ్యులు వాపోతున్నారు.

పై అధికారులకు నివేదిస్తాం

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుల ఎంపిక విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సభ్యుల ఎంపికలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే కలెక్టర్‌కు నివేదించి, కమిటీ ఎంపిక ప్రక్రియపై దృష్టి సారిస్తాం.

– వై.తిరుపతిరావు

ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement