తిమ్మాపూర్: కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని అల్గునూర్‌లో బీఆర్‌ఎస్ మానకొండూర్ నియోజకవర్గస్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశం మంగళవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు, కరీనంగర్ ఎమ్మెల్యే గంగలు కమాలాకర్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నేతలు ఎండగట్టారు. రాష్ట్రం బిహార్ వంటి పరిస్థితుల్లోకి వెళ్తోందని, రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలందరూ మోసపోతున్నారని ఆరోపించారు.
మనసు పెట్టి పోరాడాలి..
హరీశ్‌రావు మాట్లాడుతూ మానకొండూర్ కార్యకర్తలు మనసు పెట్టి పోరాడారని, ఉద్యమ సమయంలో ప్రాణం పణంగా పెట్టి పోరాడిన నియోజకవర్గమని గుర్తు చేశారు. 2002లో ఓటు హక్కు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తారని, లేకపోతే కొన్ని పత్రాలు అడుగుతారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించినట్లు, కార్యకర్తలు బూత్ లెవెల్ ఆఫీసర్‌తో కలిసి ఫారమ్‌లు నింపి ఇవ్వవచ్చని, ఎవరి ఓటు మిస్ కాకుండా చూడాలని సూచించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీని వదిలిపెట్టిన వారిని మళ్లీ చేర్చుకోవడం జరగదని, జెండా మోసిన వారికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 76గ్రామాల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అలుగునూర్ డివిజన్‌లో విజయం సాధించినట్లు తెలిపారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు మానకొండూర్ వర్షాధార ప్రాంతంగా ఉండేదని, మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీర్చినట్లు గుర్తు చేశారు. అనంతరం రామకృష్ణకాలనీ సర్పంచ్ గుజ్జుల శ్వేత పార్టీలో చేరగా హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మండల అధ్యక్షుడు రావుల రమేశ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఏకానందం తదితరులు పాల్గొన్నారు.


