కొత్తగా చెత్త సేకరణ | - | Sakshi
Sakshi News home page

కొత్తగా చెత్త సేకరణ

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● నాలుగు ఘన వ్యర్థాలుగా విభజన ● ఇంటికి నాలుగు రకాల చెత్తబుట్టలు

కరీంనగర్‌రూరల్‌: ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని కాపాడేందుకు మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తడి, పొడి చెత్తను పారిశుధ్య సిబ్బందికి అందించగా, ఇక నుంచి ఈ విధానంలో మా ర్పులు తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నాలుగు రకాలుగా విభజన

జిల్లాలోని 318 గ్రామపంచాయతీలు, జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్‌ మున్సిపాలిటీలు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నివాసగృహాల నుంచి పారిశుధ్య సిబ్బంది రోజూ తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను కలిపి ఇవ్వడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. కరీంనగర్‌లోని డంపింగ్‌యార్డులో మంటలేర్పడి వాతావరణ కాలుష్యమేర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణకు ఇక నుంచి ఇంటివద్దే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త, శానిటరీ, హాని కలిగించే వ్యర్థాలుగా విభజన చేస్తారు. చెత్తను సేకరించిన అనంతరం సెగ్రిగ్రేషన్‌షెడ్లకు తరలించి తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ, పొడి చెత్తను స్క్రాప్‌ డీలర్లకు విక్రయిస్తే ఆదాయం వస్తుంది. శానిటరీ వ్యర్థాలను సేఫ్‌ డిస్పోజల్‌ చేస్తారు. నాలు గు రకాల వ్యర్థాలను సేకరించేందుకు చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రత్యేక బుట్టలు

చెత్త సేకరణకు గతంలో ఆకుపచ్చ, నీలం రంగులో రెండు చెత్తబుట్టలు ఇచ్చేవారు. అన్ని రకాల చెత్తను ఒకే బుట్టలో వేసి పారిశుధ్య సిబ్బందికి అందిస్తున్నారు. కొత్తగా నాలుగురకాల చెత్త సేకరించేందుకు గతంలో ఉన్న ఆకుపచ్చ, నీలం రంగు బుట్టలకు తోడు నలుపు, ఎరుపురంగు బుట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించినా ఆచరణలో అమలు చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చబుట్టలో తడి చెత్త, నీలిబుట్టలో వంటింటి చెత్త, కూరగాయల తొక్కలు, ఆహార పదార్థాలు, పూలు, టీ, కాఫీ పొడి వేయాలి. నలుపు బుట్టలో పాడైన విద్యుత్‌ బల్బులు, బ్యాటరీలు, మందులు, ఎరుపు రంగు బుట్టలో మెడికల్‌ వేస్టేజీ, ఈ వేస్ట్‌ వేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో గ్రామపంచాయతీల్లో వార్డుసభ్యులు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు కొత్త చెత్త సేకరణపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement