మిషన్‌మోడ్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

మిషన్‌మోడ్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● ఫీజు చెల్లించిన ప్రతీ దరఖాస్తుదారుడికి అందాలి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌టౌన్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్‌ను సత్వరమే అందించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. ఈ ప్రక్రియను మిషన్‌ మోడ్‌లో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ పురోగతిపై మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమీక్షించారు. ఫీజులు చెల్లించిన ప్రతి దరఖాస్తుదారుకు ఆలస్యం లేకుండా ప్రొసీడింగ్స్‌ అందించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. పారిశుధ్య వాహనాలు, ఫాగింగ్‌ యంత్రాలు, ఆయిల్‌ బాల్స్‌ సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తంగా ఉంచి, భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, నగర పాలక కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, స్వామి, బషీర్‌ పాల్గొన్నారు.

21న ‘నీట్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి

ఈనెల 21న నిర్వహించే నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విద్య, వైద్యం, ఆర్టీసీ, పోలీస్‌, ఎన్పీడీసీఎల్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. గతంలో కన్నా ఈసారి పరీక్షకు 15నిమిషాలు ఎక్కువ సమయం ఉంటుందన్నారు. అభ్యర్థులు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, గుర్తింపు కార్డు, అడ్మిట్‌ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. ఆభరణాలు, షూలు ధరించి రావద్దని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అదే రోజున యోగా దినోత్సవం ర్యాలీ ఉంటుంది కాబట్టి విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement