ఏటా సాగు చేస్తా
పచ్చిరొట్ట సాగు చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: పంటలు అధిక దిగుబడి సాధించాలనే తపనతో రైతులు అవసరమున్నా.. లేకున్నా భూమిలో రసాయనాలు కుమ్మరిస్తున్నారు. తద్వారా భూసారం దెబ్బతినడంతోపాటు సూక్ష్మ, స్థూల పోషక లోపాలు ఏర్పడి చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో భూమికి సత్తువ కల్పించడంతోపాటు రసాయన ఎరువులు తగ్గించడంలో పచ్చిరొట్ట ఎరువులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. జగిత్యాల జిల్లాకు 12,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు రాగా.. 11,674 క్వింటాళ్ల జీలుగ, 827 క్వింటాళ్ల జనుము ఉంది.
పచ్చిరొట్ట ఎరువులంటే..
పచ్చిరొట్ట ఎరువులను పంట భూమికి రెండు రకాలుగా అందించవచ్చు. మొదటి పద్ధతిలో.. జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవ, పెసర, అలసంద, గోరు చిక్కుడు, మినుము, కంది, వేరుశెనగ, సెస్భెనియా, వెంపలి విత్తనాలను పొలంలో వెదజల్లి, అవి పెరిగిన తర్వాత 50శాతం పూత దశలో(45 నుంచి 60 రోజుల సమయంలో) అదే పొలంలో కలియదున్ని, కుళ్లిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. రెండో పద్ధతిలో.. వేప, తంగెడు, కానుగ, గ్లైరిసిడియా, సుబాబుల్, గుల్‌మొహర్, పొంగామియా చెట్ల ఆకులు, కొమ్మలను పొలంలో వేసి కలియదున్నాలి. వరి సాగు చేసే రైతులు తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటే పొలం సిద్ధం చేసే సమయానికి పూతకు వస్తుంది. ఆ సమయంలో కలియదున్ని నాట్లు వేసుకోవచ్చు. పండ్ల తోటల రైతులు జనుము, జీలుగ చల్లుకుంటే రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు.
జీలుగ
చౌడుభూములతో పాటు వరి పండించే భూముల్లో ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలను పొలమంతా చల్లుకోవాలి. పెరిగిన జీలుగ పంటను పూత దశలో కలియదున్నడం వల్ల ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఎకరం పచ్చిరొట్టలో 30 నుంచి 32 కిలోల నత్రజని లభిస్తుంది. జీలుగలో 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ లభిస్తుంది. నీరు నిలిచినా పంట తట్టుకుంటుంది.
జనుము
అన్ని రకాల పంట భూముల్లో సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్టగా.. పశువుల మేతగానూ ఉపయోగపడుతుంది. ఎకరానికి 9.2 నుంచి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పంట ద్వారా ఎకరానికి 5.2 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. ఇందులో 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పోటాష్‌లు ఉంటాయి. త్వరగా పెరుగుతుంది. నీటి ఎద్దడి, మురుగునీటిని తట్టుకోలేదు.
పెసర
తేలిక, బరువైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా.. పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 15.2 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరాకు అలసంద ద్వారా 4–5 టన్నులు, పిల్లి పెసర ద్వారా 4–6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. బావులు, గట్ల వెంబడి ఉండే చెట్ల కొమ్మలు, ఆకులను పొలంలో వేసి కలియదున్నితే ఎంతో లాభం.
ఉపయోగాలివీ..
పచ్చిరొట్ట పంటల్లో సేంద్రియ పదార్థం ఉంటుంది. దీనివల్ల సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమిని గుల్లపరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. పంట భూమిలో వృథాగా ఉండే పోషకాలను ఉపయోగంలోకి తేస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. ఈ జాతి పంటలకు వేర్లు లోతుగా ఉండి భూమి లోపలి పొరలను కూడా ఉపయోగంలోకి తేస్తాయి. నులి పురుగుల ఉధృతిని తగ్గిస్తాయి.
రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్న రైతులు
తొలకరిలో జనుము, జీలుగకు అధిక ప్రాధాన్యం
వరి సాగు చేసే పొలంలో ఏటా జనుము వేస్తాను. రెండు పంటల సీజన్‌కు ఉపయోగపడుతుంది. పంటకు వేసే రసాయన ఎరువులు తగ్గిస్తాను. ఖర్చు తగ్గుతుంది. భూమి సారవంతంగా మారి, దిగుబడి పెరుగుతోంది.
– స్వామిరెడ్డి,
శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలం
వరి వంటి ప్రధాన పంటలకు ముందు జనుము, జీలుగ, పప్పుధాన్యాల పంటలు సాగు చేయడం వల్ల భూమికి సత్తువ వస్తుంది. రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. రైతులు పచ్చిరొట్ట సాగు చేసి కలియదున్నితే చాలా లాభం.
– సురేష్, అసోసియేట్ డీన్,
వ్యవసాయ కళాశాల, పొలాస


