ఈ నెల 9న కరీంనగర్ మార్కెట్ పరిధిలో కల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 50 బస్తాల కారంపొడి, పసుపు, దనియాల పొడిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్‌సేఫ్టీ అధికారులకు పంపించారు.
కొత్తపల్లి మండలంలోని రాములపల్లి 50 ట్రాక్టర్ల డంపును, శాంతినగర్‌లోని సోషల్ వెల్ఫేర్ గర్‌ల్స్ స్కూల్ ప్రాంతంలో మరో 30 ట్రాక్టర్లు ఇసుక డంపును స్వాధీనం చేసుకున్నారు.
● అక్రమ దందాలపై ఉక్కుపాదం
● అప్పట్లో ఆరోపణలతో సింహభాగం సిబ్బంది అటాచ్
● తిరిగి పుంజుకుంటున్న వైనం
కరీంనగర్‌క్రైం: గతంలో అక్రమ వ్యాపారాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరీంనగర్ టా స్క్‌ఫోర్స్ విభాగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ తరలింపు, గంజా యి విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు నిర్వహించి గుర్తింపు పొందిన ఈ విభాగం, కొంతకాలంగా వివాదాలు, అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్నప్పటికీ తిరిగి చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆరోపణలతో దెబ్బతిన్న ప్రతిష్ట
ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కొందరు సిబ్బందిపై అక్రమ వ్యవహారాల ఆరోపణలు రావడంతో విభాగం ప్రతిష్ట మసకబారింది. పరిస్థితి తీవ్రతరమవడంతో ఒకేసారి సిబ్బందిని వివిధ విభాగాలకు అచాచ్ చేసి చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమార్కులకు ముందుగానే దాడుల సమాచారం అందిస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా రావడంతో పోలీస్ బాస్ వారిపై చర్యలు చేపట్టారు.
రద్దు నుంచి పునరుజ్జీవం దిశగా..
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, కరీంనగర్‌లో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలపై చర్చ జరిగింది. అయితే, విభాగాన్ని పూర్తిగా మూసివేయడం కన్నా దానిని ప్రక్షాళన చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయాలనే అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారుల్లో వ్యక్తం కావడంతో టాస్క్‌ఫోర్స్‌కు కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ దాడుల జోరు
ఇటీవల టాస్క్‌ఫోర్స్ బృందాలు అక్రమ ఇసుక రవాణా, పేకాట స్థావరాలు, గంజాయి విక్రయాలు, అక్రమ మద్యం, కల్తీ ఆహార పదార్థాల తయారీపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ వ్యాపారాలపై చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ ప్రజల్లో విశ్వాసం సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ను కేవలం దాడుల విభాగంగా కాకుండా, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక యూనిట్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు అక్రమ వ్యాపారాలకు కేరాఫ్‌గా ఉన్న ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులతో పరిస్థితులు మారిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ దందాలు చేస్తే టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు.
కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో అధికారులు, సిబ్బంది
ఏసీపీ 1
ఎస్సైలు 2
హెడ్‌కానిస్టేబుళ్లు 3
కానిస్టేబుళ్లు 7
జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సోమవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దాడి చేసి 150 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసి జమ్మికుంట పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.


