గంభీరావుపేట(సిరిసిల్ల ): మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన బంటు జ్యోతి(25) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందింది. బట్టలు ఉతికేందుకు కుటుంబసభ్యులతో చెరువు వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడింది. స్థానికులు చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
గాయపడిన ఎలక్ట్రీషియన్..
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కట్ట అశోక్(32) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరెంట్ షాక్‌తో సోమవారం తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. అశోక్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే సోమవారం రాత్రి మరణించినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. లైన్ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంతోనే అశోక్ మరణించాడని ఆరోపిస్తూ మేడారం గ్రాస్తుస్తులు మంగళవారం ధర్మారంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వపరంగా పరిహారం అందించడంతోపాటు మరికొంత ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం– మక్త రోడ్డుపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మక్త గ్రామానికి చెందిన నెలవేని రాంచరణ్(18) మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మక్త గ్రామానికి చెందిన నెలవేని కరుణాకర్–రజిత దంపతులుకు కూతురు, కొడుకు రాంచరణ్ ఉన్నారు. రాంచరణ్ సాంఘీక సంక్షేమ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటానని కేశవపట్నంలోని ఆన్‌లైన్ సెంటర్‌కు స్నేహితుడు అంజన్‌కుమార్‌తో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మక్త– కేశవపట్నం రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామచరణ్ అక్కడికక్కడే మరణించగా, అంజన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 7రోజుల జైలు
● రూ.45వేలు జరిమానా విధించిన మేజిస్ట్రేట్
కోల్‌సిటీ(రామగుండం): మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని గోదావరిఖని ప్రిన్సిపల్ కోర్టు మేజిస్ట్రేల్ వెంకట్ సచిన్ రెడ్డి ఎదుట మంగళవారం హాజరుపరిచారు. విచారణ అనంతరం నలుగురికి మొత్తం రూ.45వేలు జరిమానా విధించారు. ముగ్గురికి రూ.10వేల చొప్పున జరిమానా, మరొకరికి రూ.15వేల జరిమానా విధించారు. మరో వ్యక్తికి ఏడురోజుల జైలు శిక్ష విధించగా కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, ధ్రువపత్రాలు లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.


