తంగళ్లపల్లి(సిరిసిల్ల): వృద్ధాప్య భారం, నడుము నొప్పితో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని చింతలఠాన గ్రామానికి చెందిన బొడ్డు ముత్తవ్వ (79) కొంతకాలంగా తీవ్ర నడుము నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుమార్తె బొడ్డు రాజమ్మ గమనించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్ల ఆసుపత్రికి రాత్రి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేన్సర్ బాధ భరించలేక..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన ముదాం భాగ్యవ్వ (59) కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం వేకువజామున తన ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగు పొరుగువారు గమనించి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో ఉంటున్న ఆమె కుమార్తె విజయకు సమాచారం అందించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


