పిల్లల మేధస్సుకు పునాది.. అబాకస్‌ | - | Sakshi
Sakshi News home page

పిల్లల మేధస్సుకు పునాది.. అబాకస్‌

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

ఫాస్ట్‌గా లెక్కలు చేస్తున్న గణితంలో మెళకువలు

కరీంనగర్‌కల్చరల్‌: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు లేని యుగంలో ప్రపంచానికి లెక్కల దారి చూపిన అద్భుత పరికరం అబాకస్‌. చిన్నచిన్న గుళికలను కదిలిస్తూ పెద్దపెద్ద గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించే ఈ పురాతన సాధనం నేటికీ తన ప్రాధాన్యం కోల్పోలేదు. ముఖ్యంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వేగవంతమైన ఆలోచనాశక్తిని అభివృద్ధి చేయడంలో అబాకస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లెక్కల పరికరం ఆధునిక విద్యాప్రపంచంలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాలభవన్‌లో చిన్నారులు అబాకస్‌లో శిక్షణ తీసుకుంటూ.. సులువుగా లెక్కులు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

అబాకస్‌ నిర్మాణం

అబాకస్‌ సాధారణంగా ఒక చట్రంలో(ఫ్రేమ్‌) ఉండే కడ్డీలు, వాటిపై కదిలే ముత్యాల్లాంటి గుళికలతో తయారవుతుంది. ప్రతీ కడ్డీ ఒక స్థాన విలువను సూచిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు గుళికలను కదిలించడం ద్వారా లెక్కలు చేస్తారు. అబాకస్‌ సుమారు 2000 సంవత్సరాల కంటే పాతది. చైనా, జపాన్‌, రోమ్‌ ప్రాంతాల్లో ఉపయోగించారు. జపాన్‌లో ఉపయోగించే అబాకస్‌ను సోరోబన్‌ అంటారు.

అబాకస్‌ విశిష్టత

వేగంగా లెక్కలు చేయగలగడం, కాలిక్యులేటర్‌ లేకుండా పెద్ద లెక్కల్ని కూడా త్వరగా చేయొచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. గణితంపై భయం తగ్గుతుంది. వేగంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక లెక్కలు కొంతకాలం సాధన తర్వాత పిల్లలు అబాకస్‌ను ఊహలో చూసుకుంటూ మెంటల్‌ మ్యాథ్స్‌ చేయగలుగుతారు. చేతి, మెదడు సమన్వయంతో గుళికలను కదిలించడం వల్ల చేతి కదలికలు మెదడు పని కలిసి మెరుగుపడతాయి.

సులభంగా లెక్కల సాధన మెదుడుకు చురుకుదనం.. జ్ఞాపకశక్తి పెరుగుదల

బాలభవన్‌లో ఆరేళ్లుగా క్లాసికల్‌ డాన్స్‌, మ్యూజిక్‌ నేర్చుకుంటున్నా. గతేడాది నుంచి అబాకస్‌ నేర్చుకుంటున్నా. ముందుకన్నా ఫాస్ట్‌గా లెక్కలు చేయగలుగుతున్నా. దీనివల్ల మైండ్‌ షార్ప్‌ అవుతుంది.

– వనజాక్షి, రాంనగర్‌

గణితంలో మెళకువలతో ప్రాబ్లమ్స్‌ తొందరగా సాల్వ్‌ చేస్తున్నా. అబాకస్‌తో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంతో కష్టమనిపించేది. అబాకస్‌ శిక్షణతో సులువైంది.

– నిర్వాణ, హనుమాన్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement