● బీపీఈడీకి 1,788, డీపీఈడీకి 648 మంది అభ్యర్థులు హాజరు
● ఎండను సైతం లెక్క చేయకుండా హాజరైన అభ్యర్థులు
● 6న ఫలితాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీపీఈసెట్)–2026 శారీరక, నైపుణ్య పరీక్షలు 4 రోజుల నుంచి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ మైదానంలో జరుగుతుండగా.. బుధవారంతో ముగిశాయి. శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో నిర్వహించిన శారీరక, నైపుణ్య పరీక్షల్లో భాగంగా బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100, 400(మహిళలు), 800(పురుషులు) రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్‌తోపాటు 11 క్రీడల్లో అభ్యర్థులు ఎంచుకున్న వాటిలో పరీక్షలను నిర్వహించారు. జాతీయస్థాయిలో రాణించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వాటికి వచ్చే మార్కులను సైతం నిర్వాహకులు కేటాయించారు. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా 4 రోజుల్లో 2,436 మంది హాజరవడం విశేషం. జూన్ 6న ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్–2026 చైర్మన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్, కన్వీనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.
ఆత్మవిశ్వాసంతో గెలుపు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభ్యర్థులందరూ క్రమశిక్షణతో శారీరక నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవాలని, ఆత్మవిశ్వాసమే అభ్యర్థులను గెలుపు తీరాలను చేరుస్తుందని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ అన్నారు. అభ్యర్థులను పరిచయం చేసుకొని టీజీపీఈసెట్ నైపుణ్య పరీక్షలను ప్రారంభించారు. కన్వీనర్ రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు అన్ని వసతులతో పరీక్షలు నిర్వహించామన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,386 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,788 మంది హాజరయ్యారన్నారు. డీపీఈడీ కోర్సుకు 976 మందికి గాను 648 మంది హాజరయ్యారని తెలిపారు. రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, ఓఎస్డీ హరికాంత్, జాఫర్, నజీముద్దీన్ మునవర్, శ్రీధర్‌రావు, శాతవాహన పీడీ విజయ్‌కుమార్, వివిధ విశ్వవిద్యాలయ వ్యాయామ అధికారులు పాల్గొన్నారు.


