న్యూస్‌రీల్
ఏమో.. తెలియదు సార్!
సుబోధ్‌సింగ్ నెట్‌వర్క్‌లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూపిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సుబోధ్‌సింగ్‌ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్‌ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయనిపుణులు, బిహార్‌కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్‌లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు.
సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్‌ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్‌కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్‌క్రా్ట్‌గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్‌లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సుబోధ్‌ను బిహార్ నుంచి
తీసుకొస్తున్న సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న (ఫైల్)
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్‌మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్‌సింగ్‌గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్‌కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్‌ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్‌సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సుబోద్‌తో పాటు రఘునాథ్ కర్మాకర్, రావేశ్‌కుమార్‌లను కలిపి విచారించారు. ఇప్పటికే పోలీసులు పట్టుకున్న మరో నిందితుడు మేహతాబ్(సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి)ని కస్టడీకి దూరంగా ఉంచారు.
వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్‌కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్‌కుమార్, మెహతాబ్‌ఖాన్‌ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్‌ను మాస్టర్‌మైండ్‌గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది.


