96 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

96 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

96 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి ● 236 కొనుగోలు కేంద్రాలు మూసివేత ● మూడు రోజుల్లో ముగియనున్న ప్రక్రియ ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని ధాన్యం సేకరణ ప్రక్రియ 96 శాతం పూర్తయిందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా రైతులకు రూ.628 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 236 కేంద్రాలను అధికారులు మూసివేశారని, ఈ నెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తంగా మరో మూడు రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో, మానకొండూర్‌ నియోజకవర్గంలోని మానకొండూర్‌, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నూరుశాతం పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 3,16,926 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95 శాతం తరలింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని వివరించారు.

‘ప్రజాపాలన’ పకడ్బందీగా నిర్వహించాలి..

జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బౌండరీలు ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్వో జె.స్వామి, సీపీవో రామ్‌దత్తరెడ్డి, డీపీవో జగదీశ్వర్‌, ఇన్‌చార్జి సీఈవో పవన్‌ కుమార్‌, డీఈవో ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూపరాణి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement