జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో టీఎస్ కేసీ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. బుధవారం కళాశాల ఆవరణలో టీఎస్ సెల్ సమన్వయకర్త ఉమాకిరణ్‌తో కలిసి జాబ్‌మేళా బ్రోచర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఎంపైర్ గ్రూప్, మెడ్‌ప్లస్, మెరీనా పేయింట్స్, మహింద్రాగ్రూప్, టాటా ఫౌండేషన్ తదితర 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడి డిగ్రీ ఫైనల్ ఇయర్, చదువుతున్న విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఐటీఐ, ఎంబీఏ చేసిన యువతీయువకులు ఇంటర్వ్యూలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఓదెలుకుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ రాజేంద్రం, మాధవి, రాజకుమార్, కిరణ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు
జమ్మికుంట(హుజూరాబాద్): మహిళ మెడలో బంగారం చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ల్యాదల్ల కవిత మొక్కజొన్న చేనుకు నీరు పెడుతుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రం తండోలి జిల్లా గడసరి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి చేనులోకి వచ్చి ఆమె మెడలోని బంగారం చోరీకి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో పారిపోయాడు. వెంటనే కవిత తన భర్తకు సమాచారం ఇవ్వగా గ్రామస్తులతో కలిసి చేను వద్దకు వచ్చి చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. కొంత సమయం తర్వాత ప్రమోద్ కెనాల్ పక్కన ఉన్న ముళ్లపొదల్లో దాక్కోని బయటి వచ్చే క్రమంలో పట్టుకొని తాళ్లతో కట్టేశారు. అతడి వద్ద కత్తెర, వాటర్ బాటిల్ లభించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా టౌన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ, చోరీకి యత్నించిన వ్యక్తిని మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించామని, ఫింగర్ ప్రింట్ తీసుకొని విచారణ చేశామని తెలిపారు. రైల్లో ప్రయాణిస్తుండగా కొందరు బెదిరించడంతో దిగిపోయి సంచరిస్తున్నాడని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి కేసు నమోదు చేసినట్లు విరించారు.


