రామగుండం: భారతీయ రైల్వేలో టికెట్ బుకింగ్, రద్దు, రిఫండ్ తదితర సేవల్లో చేసిన మార్పులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. తద్వారా టికెట్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, ప్రయాణికులకు సరిపడా సీట్లు అందించడం సులభతరం కానున్నాయి. కొత్త నిబంధనలు ఇవీ..
● రైలు బయలుదేరడానికి 8 గంటల్లోపు కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేస్తే రిఫండ్ ఉండదు. రైలు బయలుదేరు సమయానికి 8–24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం, 24–72 గంటలకు ముందు రద్దు చేసుకుంటే రద్దు చార్జి మినహా మొత్తం రిఫండ్ చేస్తారు.
● రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ సమయాన్ని 4 గంటల నుంచి 9–18 గంటలకు పెంచారు. ఫలితంగా ప్రయాణానికి 18 గంటల ముందే రిజర్వేషన్ సీటింగ్ పొజిషన్ తెలుస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే వీలుంటుంది.
● బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునేందుకు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తాము ఎక్కబోయే రైల్వేస్టేషన్‌ను మార్పు చేసుకునే వీలు కల్పించారు. ఇది ప్రయాణికులకు ఎంతోసౌకర్యంగా ఉంటుంది. ఉదా: శబరిమలై యాత్రికులు ఢిల్లీ నుంచి త్రివేండ్రం రిజర్వేషన్ చేసుకుని బోర్డింగ్ రామగుండం నమోదు చేస్తారు. తద్వారా రైల్వేశాఖ ఢిల్లీ నుంచి రామగుండం వరకు మరో ప్రయాణికుడికి సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో రైల్వేశాఖకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
● గతంలో ప్రయాణికుడు తీసుకున్న బుకింగ్ కౌంటర్‌లోనే తమ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉండేది. నూతన విధానం ద్వారా ఏ రైల్వేస్టేషన్‌లోనైనా రద్దు అవకాశం ఉంటుంది. నిమిషం వ్యవధిలో బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు.
అమలులోకి వచ్చిన రూల్స్


