ముత్తారం(మంథని): పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ చనిపోవడంపై వ్యవసాయ కార్మిక ప్రజాసంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు.. ముత్తారంలోని కాసార్లగడ్డలో కేతిరి లక్ష్మి, సారయ్య కుటుంబం ఇల్లు కట్టుకొని 20 ఏళ్లుగా ఉంటున్నారు. ఆ ప్రాంతంలో రామాలయ నిర్మాణం చేపట్టాలని గ్రామపెద్దలు తీర్మానం చేశారు. కబ్జాలో ఉన్న కేతిరి లక్ష్మి ని ఇల్లు ఖాళీ చేయాలనడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరి చివరికి దాడి చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న ఇల్లును కూల్చ డం, దాడి చేయడంపై మనస్తాపం చెందిన లక్ష్మి (60) ఈనెల 3న పురుగుల మందు తాగగా, కరీంనగర్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. మృతుడి భర్త ఫిర్యాదు మేరకు కుమార్, నారాయణరెడ్డి, రాజయ్య, సతీశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, మృతురాలి కుటుంబ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘూల నాయకులు మృతదేహంతో బాధితుల ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాసార్లగడ్డ ప్రధాన చౌరస్తాలో గంటకుపైగా రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గణేశ్ మాట్లాడుతూ, లక్ష్మి మృతికి కారుకులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే వరకు అదే ఇంట్లో ఉండాలని, నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. కాగా, పెద్ద మనుషుల మధ్య కుదిరిన ఒప్పందంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ముత్తారంలో కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నిరసన


