ఇద్దరు మోసగాళ్ల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మోసగాళ్ల రిమాండ్‌

Mar 14 2026 7:35 AM | Updated on Mar 14 2026 7:35 AM

బోయినపల్లి(చొప్పదండి): తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం, రైలు టికెట్లు బుక్‌ చేస్తానంటూ రూ.18లక్షలు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వేములవాడరూరల్‌ సీఐ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్పది సాయితరుణ్‌(27), స్వగ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో పూజారిగా పనిచేస్తూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఈక్రమంలో బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన రిటైర్డ్‌ ఎంఈవో చెన్నమాధవుని రామరాజుతో పరిచయం పెంచుకున్నాడు. రామరాజు నిత్యం వాకింగ్‌, యోగా కోసం పక్కనే ఉన్న ఒద్యారం గ్రామానికి వెళ్లేవారు. ఈ పరిచయంతో సాయితరుణ్‌, రామరాజు ఇంటికి వెళ్లి అతని మొబైల్‌లో ఫోన్‌పే, పేటీఎం అప్లికేషన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పి కొత్త పిన్‌ నంబర్లు సెట్‌ చేస్తానని నమ్మబలికాడు. తనకు గుర్తుండేలా పిన్‌నంబర్లు మార్చాడు. ఆ తరువాత రామరాజు తిరుపతి దర్శనానికి వెళ్లాలని చెప్పడంతో, దర్శనం, రైలు టికెట్లు బుక్‌ చేస్తానని నమ్మించి అతని మొబైల్‌ తీసుకున్నాడు. రామరాజుకు తెలియకుండా అతని ఫోన్‌పే, పేటీఎంల ద్వారా విడతల వారీగా రూ.18,46,885లను ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ధామేర హరీష్‌ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ డబ్బులను హరీష్‌ ద్వారా క్రిక్‌బెట్‌ 99 అనే బెట్టింగ్‌ యాప్‌లో పెట్టుబడిగా పెట్టాడు. ఇందుకు ప్రతిగా హరీష్‌కు కమీషన్‌ రూపంలో దాదాపు రూ.లక్ష ఇచ్చాడు. ఆ మొత్తం డబ్బు కూడా బెట్టింగ్‌లో పోయింది. రామరాజు టికెట్ల గురించి అడిగినప్పుడల్లా సాయితరుణ్‌ వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చాడు. చివరికి మోసపోయానని గ్రహించిన రామరాజు బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజులు ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రామరాజు ఒద్యారం వచ్చినట్లు తెలుసుకుని హోటల్‌ వద్ద ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు మొబైల్‌ఫోన్లు, రూ.80వేలు నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ ఉన్నారు.

తిరుపతి దర్శనం పేరుతో రూ.18లక్షలు స్వాహా

ఆ డబ్బుతో బెట్టింగ్‌ యాప్‌లో పెట్టుబడులు

వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement