ముత్తారం: ఆంజనేయ స్వామి.. మీ పేరు పెట్టుకున్న మా గురువు అంజయ్య సారు క్యాన్సర్‌తో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా డు.. మాకు విద్యాబుద్ధులు చెప్పిన మా అంజయ్య సారును బతికించాలని పారుపల్లి హన్‌మాన్ దేవాలయంలో విద్యార్థులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పేదరికంలో ఉన్న మా సారుకు మెరుగైన వైద్యమందించేలా సీఎం రేవంత్‌రెడ్డి మనసు మార్చాలని వేడుకున్న తీరు కంటతడి పెట్టించాయి. గోదావరిఖనికి చెందిన కానుగంటి అంజయ్య ముత్తారం మండలం పారుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. గొంతు క్యాన్సర్ రావడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.30లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దాతలు ముందుకు రావాలని, 9959522650 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని విద్యార్థులు, గ్రామస్తులు వేడుకున్నారు. హెచ్‌ఎం వేగోళపు సదానందం, సర్పంచ్ సంపత్, గ్రామ కార్యదర్శి రవీందర్, అంగన్‌వాడీ కార్యకర్త తిరుపతమ్మ, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వీడియో వైరల్
ప్రభుత్వ ఉద్యోగులకిచ్చిన ఈహెచ్‌ఎస్ కార్డు ఏ ఆస్పత్రికి వెళ్లినా పని చేస్తలేదు.. గొంతు క్యాన్సర్‌తో చావుబతుకుల మధ్య ఉన్న.. గచ్చిబౌలిలోని ఓ ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరిన.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. నన్ను బతికించండి సీఎం సారు అని అంజయ్య వేడుకున్న తీరు సోషల్ మీడియాలో వైరలైంది.
గురువు కోసం ఆలయంలో విద్యార్థుల పూజలు


