వాటర్‌ బెల్‌.. నిర్వహణ డల్‌! | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ బెల్‌.. నిర్వహణ డల్‌!

Mar 14 2026 7:34 AM | Updated on Mar 14 2026 7:34 AM

● మనిషి నిత్యం కనీసం 3నుంచి 3.5లీటర్ల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ● జీర్ణక్రియ అనంతరం వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, మలబద్ధకం నివారణకు తోడ్పడుతుంది ● డీహైడ్రేషన్‌ కాకుండా, అలసట, తలనొప్పి, మెదడు మొద్దుబారకుండా ఉండటం, కండరాలు పట్టేయటం వంటి సమస్యలను నిరోధిస్తుంది ● మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపోందిస్తుంది ● ఏకాగ్రత పెరుగుతుంది. నీరు త్రాగిన తర్వాత విద్యార్థులు తరగతిలో ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు

జిల్లాలోని స్కూళ్లలో వినిపించని వాటర్‌ బెల్‌ ముదిరిన ఎండలతో పిల్లల్లో డీహైడ్రేషన్‌ సమస్య కొన్ని స్కూళ్లలో పనిచేయని బోర్లు, వాటర్‌ ప్లాంట్లు ఇంటి నుంచి తీసుకెళ్లే నీరే దిక్కు నీరు తాగేలా ప్రోత్సహిస్తేనే పిల్లల ఆరోగ్యానికి మేలు

నీరు ఎంత తాగాలి

సప్తగిరికాలనీ(కరీంనగర్‌):

ఫస్ట్‌ బెల్‌.. సెకండ్‌ బెల్‌.. ఇంటర్వెల్‌.. ఇంటి బెల్‌ వంటివి ప్రాచుర్యం పొందిన బడిగంటలు. వీటితో పాటు గతంలో కొన్ని రోజులు వినిపించిన శ్రీవాటర్‌ బెల్‌శ్రీ ఇప్పుడు ఏ పాఠశాలల్లో మోగటం లేదు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు తగినంత నీరు తాగేలా వాటర్‌ బెల్‌ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరముంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు చదువు, ఆటల్లో నిమగ్నమై నీరు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలామంది ఇంటి నుంచి నీరు తీసుకెళ్తుండగా మధ్యాహ్నం సమయంలో అన్నం తినేటప్పుడే తాగుతున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని భయంతోనూ నీటిని సరిగా తాగడం లేదు. దీంతో వ్యాధులకు గురువుతున్నారు. సరిపడా నీటిని తాగకపోవడంతో మూత్రకోశ వ్యాధులతో పాటు డీహైడ్రేషన్‌ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గతంలో అమలు చేసినా..

విద్యార్థి దశ నుంచి పిల్లలు తగినంత నీరు తాగేలా కేరళ రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేకంగా నీటి గంట విధానాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని స్ఫూరిగా తీసుకుని గతంలో జిల్లాలో అక్కడక్కడ అమలు చేసినా, తరువాత అది మరుగునపడింది. సాధారణ రోజుల్లో ఇంటర్‌వెల్‌, లంచ్‌ బ్రేకులతో పాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్‌ బెల్‌ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30కు, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, 250 ప్రైవేట్‌ పాఠశాలల్లో 62 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అనేక పాఠశాలల్లో ఇవి పని చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

చిత్రంలో మంచినీరు తాగుతున్న వారు గంగాధర మండలం ఒద్యారం జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు. గత డిసెంబర్‌లో ఈ పాఠశాల విద్యార్థులు తరచూ నీరుతాగడం, వాష్‌రూమ్‌కు వెళ్లడం మరిచిపోయారు. పాఠశాలలో రోజుకు కనీసం 1.5 లీటర్ల నీరు తాగాలనే నిబంధన ఉన్న విషయాన్ని గ్రహించిన పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు జనవరి నుంచి వాటర్‌బెల్‌ను అమలు చేస్తున్నారు. దాతల సాయంతో 63మంది విద్యార్థులకు వాటర్‌బాటిళ్లు సమకూర్చారు. రోజుకు రెండు సార్లు ఉదయం 10.45, మధ్యాహ్నం 2.45 వాటర్‌బెల్‌ను కొట్టి బయటికి పంపిస్తున్నారు. ప్రతీ విద్యార్థి స్కూల్‌లో రోజుకు 1.5 లీటర్లకు పైగా నీరు తాగుతున్నారని హెచ్‌ఎం, గంగాధర ఇన్‌చార్జి ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌ రావు వివరించారు. జిల్లావ్యాప్తంగా 651 పాఠశాలలు ఉండగా.. ఈ ఒక్క పాఠశాలలోనే వాటర్‌బెల్‌ విధానం అమలు కావడం విశేషం.

పాఠశాలలో నీటిగంట విధానాన్ని అమలు చేయడం ఒక మంచి ఆరోగ్యకరమైన ఆచరణ. విద్యార్థులు సమయానికి నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరగతిలో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై మంచి దృష్టి పెడతారు. ముఖ్యంగా వేసవికాలంలో వేడి ప్రభావం తగ్గి, హీట్‌ స్ట్రోక్‌ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో సమయానికి నీరు తాగే మంచి అలవాటు ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం ఏర్పడి, విద్యార్థులు రోజంతా చురుకుగా ఉంటారు.

– ఏనుగు ప్రభాకర్‌రావు, హెచ్‌ఎం, ఒద్యారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement