ఎరువు ధర.. రైతు దడ | - | Sakshi
Sakshi News home page

ఎరువు ధర.. రైతు దడ

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 7:45 AM

ఎరువుల ధరలు పెరిగాయో లేదో వ్యాపారులు సందట్లో సడేమియాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాత బస్తాలను కూడ కొత్త ధరలకు విక్రయిస్తూ రైతులను పిండేస్తున్నారు. వాస్తవానికి పాత స్టాక్‌ను పాత ధరకే విక్రయించాలనేది నిబంధన. ఇదెక్కడా అమలవడం లేదు. అధికారులతో ఉన్న మామూలు సంబంధాలతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. యాసంగి సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తుండగా ముందస్తుగానే ఎరువులను భారీగా నిల్వ చేశారు. ప్రస్తుత పంటలకు సరిపడా నిల్వలుండగా పెంచిన ధరలను అనువుగా మలచుకుంటున్నారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర ప్రాంతాల్లో విక్రయాలు ఎక్కువగా సాగుతుండగా పెరిగిన ధరలకు విక్రయిస్తున్నారు. ఇదేంటంటే ధరలు పెరిగాయని చెబుతూ నిలువుదోపిడీ చేస్తున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: అన్నదాతకు ఎరువుల ధరలు గుదిబండగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంతో పెట్టుబడి భారం తగ్గుతుందనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా మళ్లీ ధరలు పెంచడం కర్షకుల్లో కలవరం రేపుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో దిగుబడిపై ప్రభావం పడగా దీనికితోడు కూలీల ఖర్చు తడిసిమోపైడెంది. దీనికితోడు ఎరువుల ధరలు అదనపు భారమే. ఏకంగా బస్తాపై రూ.రూ.100– 200ల వరకు ధరలు పెరగడంతో జిల్లాపై రూ.25కోట్లకు పైగా భారం పడుతోంది.

పెట్టుబడి రాని పరిస్థితి

జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో పంటల దిగుబడి పూర్తిగా తగ్గి పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఎరువుల ధరల పెంపు రైతులకు మరింత భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేవలం యూరియా ధరలను నియంత్రిస్తుండగా రాయితీని భరిస్తోంది. భాస్వరం, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల నిర్ణయాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా 3.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇందుకు 1.43లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. ఇందులో ఎక్కువగా యూరియా 53,545 మెట్రిక్‌ టన్నులు కాగా ఇతర ఎరువులు 90,183మెట్రిక్‌ టన్నులు. కాంప్లెక్స్‌ ఎరువులకు బస్తాకు పోషకాలను బట్టి రూ.100 నుంచి రూ.200 వరకు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ధర ఎక్కువగా పెరగడంతో రైతులు దాని వాడకాన్ని తగ్గించి తక్కువ ధర ఉన్న యూరియాపై మొగ్గు చూపారు. దీంతో పంటల సాగులో ఎరువుల సమతుల్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జిల్లాలో ఎరువుల వినియోగమిలా

ఎరువుల వినియోగం

: 1.43లక్షల మెట్రిక్‌ టన్నులు

యూరియా మినహా ఽఇతర ఎరువుల

వినియోగం: 90,183 మెట్రిక్‌ టన్నులు

ప్రతి పంటకు ఎకరాన పడనున్న

అదనపు భారం: రూ.400

జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం

: 3.13 లక్షల ఎకరాలు

ఏటా రైతులపై అదనపు భారం

: రూ.25.04 కోట్లు

పెరిగిన ధరలతో అన్నదాత ఆందోళన

తాజా ధరలతో రైతులపై భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement