పెద్దపల్లి: చదువుతోపాటు ఆటల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి స్పోర్ట్స్ స్కూల్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మూడో తరగతి పూర్తి చేసినవారు, తేదీ 1–9–2017 నుంచి 31–8–2018 మధ్య జన్మించినవారు 2026–27 విద్యా సంవత్సరం నాల్గో తరగతిలో ప్రవేశానికి అర్హులు.
సీట్ల వివరాలు..
హనుమకొండలో ఇటీవల స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశారు. అందులో 40 సీట్లు బాలికలు, 40 బాలుర కు కేటాయించారు. అలాగే హైదరాబాద్‌లోని హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో బాలికలకు 20, బాలురకు 20 సీట్ల చొప్పున ఉన్నాయి.
దశలవారీగా ఎంపికలు
మండల స్థాయిలో ఈనెల 13 నుంచి 17 వరకు, జిల్లా స్థాయిలో ఈనెల 28 నుంచి ఏప్రిల్1 వరకు ఎంపికలు ఉంటాయి. రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు హైదరాబాద్‌లోని హకీంపేటలో ఎంపికలు నిర్వహిస్తారు.
ప్రతిభ ఆధారంగా..
విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. 800 మీటర్ల పరుగు పందెం, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 6/10 మీటర్ల షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్ ప్రతీ పరీక్షకు 3 మార్కులను పీఈటీలు, అధికారులు కేటాయిస్తారు.
ఎంపికై న విద్యార్థులకు ఇలా..
నాల్గో తరగతిలో ఎంపికై న విద్యార్థులకు ఇంటర్ పూర్తి చేసే వరకు ఉచిత విద్య, ఎంపిక చేసిన క్రీడాంశాల్లో నైపుణ్య శిక్షణ, వసతితో పాటు పౌష్టికారం అందిస్తారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లో క్రీడా కోట వర్తిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
మూడో తరగతి చదివి క్రీడల్లో పట్టున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. 4వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి.
– సురేశ్, డీవైఎస్‌వో, పెద్దపల్లి


