కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి: డంపుయార్డు సమస్యను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు నగరపాలకసంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. మంగళవారం డంప్‌యార్డ్‌ను సందర్శించారు. బయోమైనింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. మరింత వేగవంతం చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. డంపుయార్డు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డంపుయార్డులో మొత్త 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, యంత్రాలసాయంతో ప్రక్షాళన చేయడం జరుగుతోందన్నారు. అధునాతన యంత్రంతో దాదాపు 15 వేల మెట్రిక్ టన్నుల చెత్తను 3 రకాల పద్ధతుల్లో బయోమైనింగ్ చేశామన్నారు. డంపుయార్డులో త్వరలోనే మరో బయోమైనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పొగను తగ్గించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్ ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం నగరంలోని 19వ డివిజన్‌లో కార్పొరేటర్ సుధగోని మాధవితో కలిసి పారిశుధ్య పనులు పరిశీలించారు. హరిహర, విజయదుర్గాకాలనీల్లో డ్రైనేజీల పరిస్థితిని తనిఖీ చేశారు. అవసరమైన చోట రూ.5 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. 44వ డివిజన్ శ్రీనగర్‌కాలనీలో అసంపూర్తిగా ఉన్న నాలాను పరిశీలించారు. నాలా సగంలోనే నిలిచిపోవడం వల్ల వరద వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతం ముంపునకు గురవుతుందని కార్పొరేటర్ చాడగొండ కవిత విజ్ఞప్తి చేయడంతో నాలాను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సప్తగిరికాలనీలోని నగరపాలకసంస్థ వాహన షెడ్‌లో రూ.2.50 లక్షలతో చేపట్టనున్న సంప్ నిర్మాణానికి కార్పొరేటర్ కవిత శంకుస్థాపన చేశారు.


