వేసవి భత్యం
కరీంనగర్ అర్బన్: గ్రామీణ ప్రాంత కూలీల వలసలను నిరోధించేందుకు, ఉన్న ఊరిలోనే పనులు కల్పించే సదుద్దేశంతో ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. పంట పొలాలు చదును చేయడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తొలగించడం, వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు వేయడం, హరితహారంలో మొక్కలు నాటడం, వాటికి కంచెలు ఏర్పాటు చేయడం వంటి తదితర పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత అంటే ఎండాకాలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతుంటాయి. ఏటా అమలు చేసే వేసవి భత్యం విషయంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో దానిపై సందిగ్ధం నెలకొంది.
భత్యం ఉన్నట్టా.. లేనట్టా
వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జోరుగా సాగుతుంటాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో పూర్తిస్థాయిలో పనులు చేయలేని పరిస్థితి ఉండటంతో వారికి వేసవి భత్యం అమలు చేసేవారు. ఫిబ్రవరిలో 20శాతం, మార్చి, ఏప్రిల్‌లో 25శాతం, మేలో 30శాతం, జూన్ 25శాతం అందించేవారు. ఈ సారి ఫిబ్రవరి పూర్తయి మార్చి వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌లోనే కార్యకలపాలు కొనసాగుతూ వచ్చాయి. కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించిన ఎలాంటి ఆప్షన్ లేదు. దీంతో ఈ సారి అమలవుతుందా ..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు భత్యం లేకపోతే కూలీలు నష్టపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
పల్లెల్లో ఊపందుకున్న పనులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధి పనులు జోరందుకున్నాయి. రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుండగా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు ఒక్కో కూలీకి నిత్యం రూ.186–200ల వరకు చెల్లిస్తున్నారు. కాగా.. ప్రతి వేసవిలో ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు అందని ద్రాక్షగా మారాయి. సమావేశాల్లో చెప్పడమే తప్పా ఆచరణలో ఒరిగింది శూన్యం. మండుటెండలో పనులు చేసి వడదెబ్బకు గురై మరణించినవారూ లేకపోలేదు. ఉపాధి పనులు జరిగే చోట నీడ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. కూలీలకు మంచి నీటి సౌకర్యం కల్పించాలి. నీటి వసతి కల్పించని క్రమంలో ప్రతి నిత్యం కూలీతో పాటుగా రూ.5 అదనంగా మంచినీటి భత్యం చెల్లించాలి. పని ప్రదేశంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. పని చేస్తున్న సమయంలో కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. కూలీలు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలి. నిబంధనలు కూలీలకు ప్రయోజనకరమైనా అధికారులు అమలులో చతికిలపడుతున్నారు.
సౌకర్యాలు కల్పిస్తారా.. గతమే పునరావృతమా?
ఉపాధి హామీలో మార్గదర్శకాలేవీ
డోలయమానంలో కూలీల పరిస్థితి
జిల్లాల వారీగా ఉపాధి హామీ పనుల వివరాలు
జిల్లా గ్రామాలు జాబ్‌కార్డులు కూలీల సంఖ్య
కరీంనగర్ 313 1,35,642 2,96,756
పెద్దపల్లి 266 1,17,800 2,46,636
జగిత్యాల 380 1,05,000 1,56,000
రాజన్న సిరిసిల్ల 260 98,000 1,97,000


