ముస్తాబాద్(సిరిసిల్ల): పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన బడుగు జీవి అర్ధాంతరంగా కన్నుమూశాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన రాగం ప్రశాంత్(29) మస్కట్‌లో గుండెపోటుతో రెండురోజుల క్రితం మృతి చెందాడు. ఈమేరకు మస్కట్‌లో ఉన్న తెలుగువారు మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. వివరాలు.. వ్యవసాయం చేసుకునే ప్రశాంత్ సరైన ఉపాధి లభించడం లేదని, రెండేళ్ల క్రితం మస్కట్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 7న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రశాంత్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, గుండెపోటుకు గురై మృతువాతపడ్డాడు. ప్రశాంత్ మృతితో తల్లిదండ్రులు దేవయ్య, మంజుల, భార్య స్రవంతి, కూతురు రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను గ్రామస్తులు కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


