సిరిసిల్ల: రోడ్డు లేని పల్లెలు.. కాలినడకకు తొవ్వ లేని ఊర్లు.. పక్కా భవనాలు లేని బడి.. కూర్చోను కుర్చీలు లేవు.. పాఠాలు చెప్పేందుకు నల్ల బోర్డులు లేని దుస్థితి. పూరిపాకలు.. తాటికమ్మల గుడిసెలు.. కర్రపలకలపై అక్షరాలు దిద్దించిన ఆ చేతులు అచేతనమయ్యాయి. పని చేసే చోటే అద్దె ఇంట్లో అరకొర వసతుల మధ్య ఉంటూ.. మూడున్నర దశాబ్దాల పాటు విద్యాబుద్ధులు నేర్పిన తొలి‘తరం’ గురువు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భగవంతరావునగర్‌కు చెందిన రంగన్నగారి సుందర్‌రావు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. 34 ఏళ్ల పాటు నిరాటంకంగా పల్లెతో పెనవేసుకున్న ఆత్మబంధం సోమవారం ‘చితి’కిపోయింది. కోనరావుపేట మండలం బావుసాయిపేటలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరిన సుందర్‌రావు 34 ఏళ్ల పాటు ఆ ఊరిలో ఉపాధ్యాయుడిగా పని చేసి 2000లో ఉద్యోగాన్ని విరమించారు. మధ్యలో రెండుసార్లు బదిలీ అయినా.. వెంటనే ఆ బదిలీ రద్దు కావడంతో ఆ ఊరిలోనే చాలా కాలం పని చేశారు. అసమానతలు, అవమానాలు, దోపిడీ పోవాల ంటే చదువు ఒక్కటే మార్గమని ఆ గురువు సుందర్‌రావు నమ్మి ఊరిలో చైతన్యాన్ని రగిలించేందుకు వీధి నాటకాలు వేయించారు. వినాయక నవరాత్రి వేడుకలను వేదికగా చేసుకుని అనేక చైతన్యవంతపు ప్రదర్శలు ఇప్పించారు. బతికినంత కాలం ఎవ్వరికీ చేయిచాపకుండా ఆత్మగౌరవంతో జీవించిన సుందర్‌రావు మాస్టారు అస్తమించారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన భార్య విజయ కన్నీటితో భర్తను సాగనంపారు. ఆయన పిల్లలు రఘుశర్మ(ఆర్కిటెక్చర్), సుమలత–సుధాకర్‌శర్మ (బ్రాహ్మణ సంక్షేమ మండలి మాజీ సభ్యురాలు), శోభన్‌బాబు(ఏవీఐ హనుమకొండ) సుధా(గృహిణి) ఉన్నారు.
● అనారోగ్యంతో తొలితరం గురువు సుందర్‌రావు మృతి


