అన్నదమ్ములను కలిపిన పంచాయతీ ఎన్నికలు
వీర్నపల్లి(సిరిసిల్ల): సర్పంచ్ ఎన్నికలు విడిపోయిన అన్నదమ్ములను కలిపాయి. ఏళ్లుగా మాటలు లేని సోదరులను దగ్గర చేశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్‌తండా, గర్జనపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను ఒక్కటి చేశాయి.
23 ఏళ్ల తర్వాత..
లాల్‌సింగ్‌తండాకు చెందిన అన్నదమ్ములు భూక్య గంగారెడ్డి, భూక్య చిన్నారెడ్డి మధ్య 23 ఏళ్లుగా మాటలు లేవు. 2001లో ఎన్నికల సమయంలో అన్న గంగారెడ్డిని దగ్గర ఉండి గెలిపించిన చిన్నారెడ్డి తర్వాత దుబాయి వెళ్లి 2002లో తిరిగి వచ్చారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 23 ఏళ్లుగా మాటలు లేవు. గతంలో వీర్నపల్లి ఎస్సైగా పనిచేసిన ఎల్లాగౌడ్ అన్నదమ్ములను పిలిపించి సఖ్యత పెంచేందుకు ప్రయత్నించారు. అయినా వారు ఎడమొహం.. పెడమొహంగానే తిరిగారు. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటయ్యారు. అన్న గంగారెడ్డిని గెలిపించేందుకు తమ్ముడు చిన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. 23 ఏళ్ల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అన్న విజయం సాధించడంతో అన్నదమ్ములను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఆరేళ్ల తర్వాత ఒక్కటయ్యారు
వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన బుచ్చగారి భాస్కర్‌గౌడ్, రాకేశ్‌గౌడ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆరేళ్లుగా మాటలు లేవు. తమ్ముడు రాకేశ్‌గౌడ్ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. అన్నకు ఫోన్ చేసి సహకరించాలని కోరడంతో భాస్కర్‌గౌడ్ ముందుకొచ్చాడు. తమ్ముడిని గెలిపించేందుకు భాస్కర్‌గౌడ్ గ్రామస్తులను ఒక్కటి చేశారు. రాకేశ్‌గౌడ్ విజయం సాధించడంతో గ్రామస్తులు సైతం హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
అన్నదమ్ములను కలిపిన పంచాయతీ ఎన్నికలు


