ఆమెకు భరోసా
కరీంనగర్‌క్రైం: సమాజంలో అన్యాయానికి గురైన మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది. బాధిత మహిళలకు భరోసా కల్పిస్తోంది. జిల్లాలోని కొత్తపల్లిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన భరోసా కేంద్రం వివిధ కేసుల్లోని బాధిత మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అలాగే మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ వేదికగా ఉంటోంది. కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని గతేడాది డిసెంబర్ 22న అప్పటి డీజీపీ జితేందర్ ప్రారంభించారు. వివిధ సందర్భాల్లో అన్యాయానికి గురై పోలీసుస్టేషన్‌కు వెళ్లేందుకు భయపడేవారికి భరోసాకేంద్రాల్లో స్నేహపూర్వక, మానవీయ వాతావరణంలో న్యాయ, వైద్య, మానసిక సలహా సేవలు అందిస్తున్నారు.
బాధితులకు చేయూత
కరీంనగర్‌లోని భరోసా కేంద్రం మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, గృహహింస, ఇతర దారుణ ఘటనల్లో బాధితులకు ఒకేచోట న్యాయ, వైద్య, మానసికసాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పడింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లే ముందు ఈ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా గోప్యత, ఆత్మవిశ్వాసంతో తమ సమస్యను వివరించగలుగుగుతున్నారు. మానసిక వైద్యులు, అడ్వోకేట్లు, సోషల్ కౌన్సిలర్లు సాయం అందిస్తున్నారు. కోర్టు ప్రక్రియలో సులభతరం కోసం డాక్యుమెంటేషన్, లీగల్ సపోర్ట్, కౌన్సెలింగ్ సేవలు కల్పిస్తున్నారు. భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 45 పోక్సో కేసులు, 15 అత్యాచార కేసులు, మూడు ఇతర కేసుల్లో బాధితులకు న్యాయసాయం అందించారు. వివిధ సందర్భాల్లో అత్యవసర పరిస్థితిలో ఉన్న 43మంది బాధిత మహిళలకు వైద్యసాయం అందించారు. 44 పాఠశాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పించారు.
ప్రత్యేక శ్రద్ధ
గృహహింస, లైంగిక వేధింపులు, చిన్నారులపై హింస, మేజర్ మానసిక సమస్యలతో పాటు వివిధ కేసుల్లో బాధితులు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు. వారి వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడంలో శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కేంద్రాల్లో సేవలు, గృహహింస కేసుల్లో మహిళలకు పోలీసు సహకారం, పోక్సో చట్టం కింద బాధిత చిన్నారులకు న్యాయసాయం, కౌన్సెలింగ్, మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన కేసుల్లో తాత్కాలిక ఆశ్రయం ఇస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు ప్రక్రియలో పూర్తి రక్షణ, మార్గదర్శనం చేస్తున్నారు. వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సేవలు, న్యాయ నిపుణులు, మహిళా అధికారులు, సోషల్ వర్కర్లు అందుబాటులో ఉండటంతో బాధితులకు వ్యక్తిగత ఆదరణ లభిస్తోంది. వివిధ కేసుల్లో 39మంది బాధితుల తరఫున దరఖాస్తులు సమర్పించగా, 11మందికి రూ.3,50,000 పరిహారం అందించారు.


